ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఉన్నతాధికారులు
చిన్న, చిన్న సమస్యలను ఎన్నిసార్లు చెప్పుకోవాలి?
వెనక్కి తగ్గామని తక్కువ అంచనా వేయొద్దు
సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయం తీసుకోవాలి
లేకుంటే దీపావళి తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ తప్పదు
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పలుమార్లు చర్చల తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు కాకపోవడం పట్ల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాత్సారం చేస్తుండటం పట్ల అసహనం వెలిబుచ్చింది. కొంత మంది ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. బదిలీలు, పదోన్నతులు తదితర చిన్న, చిన్న సమస్యలకు కూడా ఎన్నిసార్లు చెప్పుకోవాలి? అని ప్రశ్నించింది.
ఉద్యమాలను నేర్పిన సంఘాలతో కూడిన జేఏసీ తమదనీ, తక్కువగా అంచనా వేయొద్దని కోరింది. జేఏసీలో 206 సంఘాలు, 13.31 లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి అంతా గ్రాడ్యుయేట్లమేనని గుర్తు చేసింది. సమస్యల పరిష్కారం కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలనీ, లేకుంటే దీపావళి తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ తప్పదని హెచ్చరించింది. శుక్రవారం హైదరాబాద్ లోని టీజీవో భవన్ లో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
51 శాతం ఫిట్మెంట్తో2023 జులై 1 నుంచి అమలు చేయాలి : మారం జగదీశ్వర్
పీఆర్సీ రిపోర్ట్ ను వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్మెంట్ తో 2023 జులై ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణకు తక్షణమే అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈహెచ్ఎస్ కు నిధుల కొరత లేదనీ, ట్రస్ట్ వద్ద రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. సీఎం ఇచ్చిన హామీపై నిలబడకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. చిన్న, చిన్న సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీగా రూ.10 వేల కోట్ల బకాయిలను, రెండు డీఏలను, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటును సాధించామని గుర్తుచేశారు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓపీఎస్ అమలవుతున్నదని ఆయన గుర్తుచేశారు. జేఏసీ ప్రతినిధుల పట్ల సీఎస్ సంజయ్ జాజు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిలబెట్టి మాట్లాడటం, మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారనీ, ఆస్పత్రులు ఎక్కువగా చార్జీలు చేస్తున్నా....దానిపై సమీక్షించకపోవడం సరికాదన్నారు. సీఎస్ తీరుతో సంక్షోభ పరిస్థితి వస్తున్నదని విమర్శించారు.
సీఎం ప్రకటించినా సీపీఎస్ పై అధ్యయన కమిటీ వేయలేలు : ఏలూరి శ్రీనివాసరావు
ముఖ్యమంత్రి ప్రకటించినా సీపీఎస్ పై అధ్యయన కమిటీని వేయలేదని ఏలూరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రతి రెండు నెలలకు ఒకసారి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినా ముందుకు కదలడం లేదన్నారు. హెచ్ఓడీల నుంచి సచివాలయానికి 12.5 కోటా అమలు చేయాలని సీఎస్ సర్క్యులర్ ఇచ్చినా... అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించాలని కోరితే ఒక్క సారి మాత్రమే సంబంధిత ముఖ్యకార్యదర్శి సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈహెచ్ఎస్ రోగులను కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు చిన్నచూపు చూడటం మానుకోవాలని హెచ్చరించారు. దీపావళి వరకు వేచి చూసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎల్ నినో నేపథ్యంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలనీ, జీవో 317, జీవో 190ను మిగిలిన శాఖలనూ అమలు చేయాలని జేఏసీలోని అన్ని సంఘాలకు ప్రభుత్వ గుర్తింపును పునరుద్ధరించాలనీ, ఆర్థికేతర సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ కో చైర్మెన్ చావ రవి, జి.సదానందం గౌడ్, బి.మధుసూదన్ రెడ్డితో పాటు ముబీజ్ హుస్సేన్, బి.శ్యాం వివిధ భాగస్వామ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)