Magazines

ఎన్‌ఈహెచ్‌ఎస్‌‌లో ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలి

13 నిమిషాల క్రితం

New Employees Health Scheme
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

సీఎస్‌ సంజయ్‌‌జాజు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఎన్‌ఈహెచ్‌ఎస్‌) పథకం అమలులో ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు ఎదుర్కొనకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఎన్‌ఈహెచ్‌ఎస్ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన సమస్యలు, ముఖ్యంగా ఆస్పత్రుల్లో అడ్మిషన్లు, వైద్య చికిత్సలు, బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం యశోద, అపోలో, కిమ్స్ తదితర కార్పొరేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో ఆన్‌‌లైన్‌‌లో సీఎస్‌ ‌మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన ఫిర్యాదులపై ఆస్పత్రుల ప్రతినిధుల నుంచి వివరణ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఈహెచ్‌ఎస్ పరిధిలోని రోగులకు ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరించకూడదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న పాత బిల్లులను వీలైనంత త్వరగా పరిష్కరించాలనీ, చికిత్సకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వైద్య చికిత్సల ధరల్లో పారదర్శకత, ఏకరూపత ఉండేలా చర్యలు తీసుకోవాలనీ, ధరలను క్రమబద్ధీకరించడంతో పాటు జవాబుదారీతనాన్ని పెంపొందించాలని ఆదేశించారు. చికిత్సల ఛార్జీల విషయంలో సీజీహెచ్‌ఎస్(సీజీహెచ్‌ఎస్‌) నిర్దేశించిన ధరలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బీఎండీ ఎక్కా, నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శులు క్రిస్టినా చోంగ్తు, యోగితా రాణా, శిఖా గోయల్, సర్ఫరాజ్ అహ్మద్, గౌరవ్ ఉప్పల్, శృతి ఓజా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ, ఇతర ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్