హైదరాబాద్ ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ప్రాజెక్టుల్లో ఉత్సవాలు..లబ్దిదారులందరికీ ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సొంత ఇంటి కలను నిజం చేస్తూ అనేక జీవితాల్లో కొత్త కాంతులను తెస్తున్న ఇందిరమ్మ ఇండ్లు వద్ద దీపావళి పండుగ సంబురాలను పెద్ద ఎత్తున జరపనున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ అనే పేరుతో చేపట్టిన ఈ ఉత్సవాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరినీ భాగస్వామ్యులను చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన రెండు లక్షల ఇందిరమ్మ ఇండ్ల వద్ద దీపాలు వెలిగిస్తూ పండుగను మరింత శోభాయమానం చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతం తెలిపారు. వినూత్నమైన ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరూ పాల్గొనాలని ఆయన కోరారు. కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచుతూ, తమకు సొంత ఇల్లు ఏర్పడిందన్న సంతోషంతో జరుపుకుంటున్న ఈ ఉత్సవాల్లో సీఎంతో సహా ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొననున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నిజం చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా 5.50 లక్షల ఇండ్లను పూర్తి పారదర్శకంగా మంజూరు చేయగా వాటిలో ఇంతవరకు సుమారు రెండు లక్షల ఇండ్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ ఇండ్ల లబ్ధిదారులకు సుమారు రూ.8 వేల కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి ముందు, దీపాలను వెలిగించి, ఆ కుటుంబాల సమక్షంలోనే పండుగను జరుపుకుంటామన్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో ఇప్పటికే పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల ముంగిట్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేత్ర స్థాయి సిబ్బందికి గ్రామ కార్యదర్శులకు కూడా సూచనలిచ్చినట్టు తెలిపారు.లబ్ధిదారులందరూ తమ ఇండ్లు కనిపించేలా, కుటుంబంతో సహా జరుపుకుంటున్న పండుగ ఫోటోలను ఇందిరమ్మ ఇండ్లు మొబైల్ యాప్ ద్వారా తీసి వాటిని తమ సోషల్ మీడియా (పేస్ బుక్, ఇన్ స్టా గ్రాం)లో “అప్ లోడ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ క్యూర్ పరిథిలో కూడా....
ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు హైదారాబాద్ మహానగర పరిథిలోని అత్యంత ఖరీదైన భూమూల్లో పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో చేపట్టిన ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా, పలు చోట్ల నిర్మాణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టు సైట్ లలో కూడా దీపావళి సంబురాలను నిర్వహించనున్నామని గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి విపి గౌతం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సైట్ ల వద్ద దీపావళి నాడు పండుగ జరుపుకునేట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొద్ది కాలంలోనే తమ ఇరుగు పొరుగు కానున్న కుటుంబాలతో కలిసి నివసించబోయే సొంతింటి ప్రాంగణంలో పండుగ సంబురాలను నిర్వహిస్తున్నామన్నారు. పండుగ నాడు సాయంత్రం నాలుగు గండటల నుంచి ఆరు గంటల వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లబ్ధిదారులందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గృహ ప్రవేశాలు చేసుకుని వచ్చే ఏడాది దీపావళిని పండుగను మరింత సంబరంగా జరుపుకునేలా చూడాలన్నది ప్రభుత్వ లక్షమన్నారు.






కామెంట్లు (0)