పరిశ్రమలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
చర్లపల్లిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఈఎస్‌ఐ ఆరోగ్య కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-నాచారం
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం ఫేజ్-2లోని ప్రొఫెసర్ జయశంకర్ పబ్లిక్ పార్క్‌లో 'సిన్మియాస్' ఆధ్వర్యంలో సుమారు రూ.7 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆధునిక జిమ్, ఈఎస్‌ఐ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. పరిశ్రమల స్థాపనతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌ను డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఐటీతో పాటు ఎంఎస్‌ఎంఈ సహా అన్ని పారిశ్రామిక రంగాల్లోనూ ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ప్రస్తుతం 80 వేల నుంచి 90 వేల మందికి ఉపాధి లభిస్తుండగా, భవిష్యత్‌లో ఈ సంఖ్యను రెండు లక్షలకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మల్కాజిగిరి పరిధిలో పెరుగుతున్న జనాభా, నగరీకరణకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 24 రైల్వే బ్రిడ్జిలు మంజూరు చేసినట్టు మంత్రి చెప్పారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సు నిర్వహిం చనున్నట్టు వెల్లడించారు.
ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం పరిశ్రమల యాజమాన్యాలు సమిష్టిగా నిధులు సమీకరించి ప్రత్యేక పారిశ్రామిక ఫండ్ ఏర్పాటు చేయడంతోపాటు శిక్షణా సంస్థను స్థాపించాలని కోరారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్థానిక క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సిన్మియాస్ చైర్మెన్ డాక్టర్ కె. గోవిందరెడ్డి మాట్లాడుతూ.. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. సిన్మియాస్ వైస్ చైర్మెన్ తాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆధునిక జిమ్‌తో పాటు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు, సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఎన్ఎంఐఏఎస్ఎస్ ప్రతినిధులు, వీఆర్ ఇంజినీరింగ్ వర్క్స్ రాము, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)