మరో కేసులో వృద్ధురాలి హత్య.. నిందితురాలికి డబుల్ జీవిత ఖైదు
నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మహిళపై లైంగికదాడికి యత్నించడం, అక్రమ నిర్బంధం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి నేరాలకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం 31 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. అదేవిధంగా వృద్ధురాలి హత్య కేసులో ప్రధాన నిందితురాలికి నల్లగొండ కోర్టు డబుల్ జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ రెండు తీర్పుల వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో ఓ మహిళపై లైంగికదాడికి యత్నం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలో వజ్జ శ్రీను అలియాస్ కార్తీక్ (31)పై కేసు నమోదైంది. ఇతను నల్లగొండ మండలం అనంతారం గ్రామానికి చెందినవాడు కాగా, ప్రస్తుతం నల్లగొండ పట్టణంలోని అబ్బాసియా కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ కేసుపై నల్లగొండలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం కమ్-2 అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు నవంబర్ 6న తీర్పు వెలువరించింది. ఐపీసీ సెక్షన్ 306 కింద 10 సంవత్సరాలు, సెక్షన్ 376 రెడ్‌విత్ 511 కింద 10 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ 3(2)(v)(va) కింద 10 సంవత్సరాలు, ఐపీసీ సెక్షన్ 342 కింద సంవత్సరం చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.20 వేల జరిమానా విధించింది. అన్ని శిక్షలనూ ఏకకాలంలో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన అధికారులు గుత్తా వెంకట్ రెడ్డి, జి. వెంకటేశ్వర్ రెడ్డితో పాటు ప్రస్తుత ఎస్డీపీఓ కె.శివరాం రెడ్డి, సీఐ కె.ఆదిరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎస్. శోభారాణి, ఆర్. అఖిల, డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ బి. వెంకటేశ్వర్లు, లైజన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
వృద్ధురాలి హత్య కేసులో..
కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్లపహాడ్ గ్రామం రెగులగడ్డలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న సయ్యద్ ఆశాబీ(74)ని 2019 జులై 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో దుండగులు హత్య చేశారు. బెల్ట్ షాప్ నిర్వహణకు సంబంధించిన పాత కక్షలు, మనస్పర్థల నేపథ్యంలో నిందితులు ప్లాన్ ప్రకారం ఇంట్లోకి ప్రవేశించి గొడ్డలితో దాడి చేసి.. కత్తితో గొంతు కోసి ఆమెను హత్య చేశారు. ఈ ఘటనపై అదే రోజు ఉదయం కోర్లపహాడ్ గ్రామానికి చెందిన సయ్యద్ జాకీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ముషం అంతమ్మ (54), చింతల శ్రీను (34), విప్పు ధనలక్ష్మి అలియాస్ ధనమ్మ (34)ను నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ అనంతరం ఏ-1 ముషం అంతమ్మకు ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య నేరానికి జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా, సెక్షన్ 120(బి) కింద నేరపూరిత కుట్రకు మరో జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. అదేవిధంగా సెక్షన్ 452 కింద ఏడేండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా, సెక్షన్ 201 కింద మరో ఏడేండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. మొత్తం రూ.20 వేల జరిమానా చెల్లించాలని, చెల్లించని పక్షంలో ప్రతి సెక్షన్‌కూ నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో ఏ-2గా ఉన్న చింతల శ్రీను మరణించగా, ఏ-3 విప్పు ధనలక్ష్మి అలియాస్ ధనమ్మను న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసింది.
కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులు
ఈ కేసు దర్యాప్తులో అప్పటి కేతేపల్లి ఎస్ఐ బి.రామకృష్ణ మొదటి దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. అనంతరం శాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్లు కె. కాస్ట్రో, పి.ఎన్.డి. ప్రసాద్ దర్యాప్తు అధికారులుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-1 ఎస్. శోభారాణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-1 ఆర్. అఖిల సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ప్రస్తుతం కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న ఎస్.సతీష్, శాలిగౌరారం సీఐ పి.రాజశేఖర్, నల్లగొండ ఎస్డీపీఓ కె. శివరాం రెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్ పర్యవేక్షణలో కోర్టు ప్రక్రియలు కొనసాగాయి. కేతేపల్లి పోలీస్ స్టేషన్ కోర్టు డ్యూటీ అధికారులు ఎం.డి. వసీం, జి. సురేష్, లైజన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్ కోర్టు సమన్వయం, సాక్షుల హాజరు తదితర అంశాల్లో కీలకంగా పనిచేశారు.






కామెంట్లు (0)