అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, హాస్టళ్లు, ఆస్పత్రుల నిర్మాణాల్లో వేగం పెంచి త్వరితంగా పూర్తిచేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. జనగాం మెడికల్ కాలేజీ భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయా భవనాల నిర్మాణ పురోగతిపై మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షించారు. అందులో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, డీఎంఈ వాణి, అకాడమిక్ డీఎం రమాదేవి, కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట్, జనగాం కలెక్టర్లు చిత్రా మిశ్రా, సత్య చంద్రిక, హైమావతి, సందీప్ కుమార్ ఝా, ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
జనగాం మెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. కాలేజీ, సీసీబీ భవనాల ప్రారంభోత్సవానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. కరీంనగర్ మెడికల్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలాఖరుకల్లా గర్ల్స్ హాస్టల్, డిసెంబర్ చివరికల్లా బాయ్స్ హాస్టల్‌ను, మార్చి నాటికి మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సిద్ధిపేట మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, ఆయుష్ హాస్పిటల్ తదితర సంస్థలకు మాజీ మంత్రి, దివంగత అనంతుల మదన్ మోహన్ పేరు పెడుతూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వెంటనే ఆయా సంస్థల నేమ్ బోర్డులు మార్చాలనీ, ప్రభుత్వ రికార్డులు, వెబ్సైట్లలోనూ పేరును అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్‌కు, ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి సూచించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. హుస్నాబాద్ ఏరియాస్పత్రిని 250 బెడ్లకు విస్తరించే పనులను త్వరితంగా పూర్తిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. హుస్నాబాద్‌లో మెడికల్ పీజీ కాలేజీని సైతం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి దామోదర్ రాజనర్సింహ గుర్తు చేశారు.





కామెంట్లు (0)