ప్రజావసరాలకే వినియోగించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ – కూకట్‌పల్లి
ప్రజా ప్రయోజనాల కోసం స్థానిక రైతుల నుంచి సేకరించిన భూములను ప్రజల అవసరాలకే వినియోగించాలి తప్ప వేలం వేయొద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూములను వేలం వేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని ట్రక్ పార్క్ భూముల వేలానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం చేపట్టిన శాంతియుత నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను వేలం వేసి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజలకు అండగా ఉండే ఎర్రజెండా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కూకట్‌పల్లి రైతుల నుంచి ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూములను అదే లక్ష్యంతో వినియోగించాలని డిమాండ్ చేశారు. ట్రక్ పార్క్ భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేసి, ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దీక్షలో సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఐలాపురం రాజశేఖర్, కూకట్‌పల్లి మండల కార్యదర్శి ఎం. శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్, కృష్ణ, సీపీఐ(ఎం) నాయకులు ఏ. విజయ, బి. రాములు, చెన్నకేశవులు, కులుకాని లక్ష్మణ్, సునీత, నియోజకవర్గ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, ముద్దం నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)