అది నా పరిధిలోని అంశం కాదు : కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు ఆర్థిక సహకారం, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ)తో రుణ సమీకరణ వ్యవహారాలపై తనకు ఎలాంటి సమాచారం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అవి తన శాఖ పరిధిలోని అంశాలు కావని స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ ఆయన మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి సమావేశమైన అశ్వినీ వైష్ణవ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతులు, ఆర్థిక సహకారం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ ఏడాది జూన్ 22న రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి కలిసి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం జూన్ 23న ఈ ముగ్గురు నేతలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తోనూ భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, ఐఆర్‌ఎఫ్‌సీతో రుణ సమీకరణ, నిధుల కేటాయింపు తదితర అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రికి అపాయింట్‌మెంట్ ఇప్పించి మరీ కిషన్‌రెడ్డి ఈ చర్చల్లో పాల్గొన్న నేపథ్యంలో, తాజాగా మెట్రో రుణ వ్యవహారం తనకు తెలియదని, అది తన పరిధిలోకి రాదని అశ్వినీ వైష్ణవ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం, నిధుల సమీకరణపై స్పష్టత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2029 నాటికి బుల్లెట్ రైలు
దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు కారిడార్ పనులు వేగంగా సాగుతున్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాది మే నెలలో ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన బుల్లెట్ రైలు కోచ్‌లు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కారిడార్‌లోని సూరత్-బిలిమోరా సెక్షన్‌లో సుమారు 50 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన సెక్షన్లలోనూ ఇదే వేగంతో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు ప్రయాణిస్తుందని తెలిపారు. 2029 నాటికి ముంబాయి సమీపంలోని ఠాణే వరకు బుల్లెట్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.






కామెంట్‌లు (0)