శాశ్వత పనులకు రూ.1,115 కోట్ల కేటాయింపు
ఉత్తమ లోగో డిజైన్, ట్యాగ్ లైన్ కు బహుమతులు : మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గోదావరి పుష్కరాలు-2027ను నిర్వహించేందుకు రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న 74 ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జరిగే గోదావరి పుష్కరాలు-2027 లోగో డిజైన్ , ట్యాగ్ లైన్ పోటీలపై సోమవారం హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్ధులకు నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని శాశ్వత పనుల నిమిత్తం రూ 1,115 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించినట్టు తెలిపారు. అందులో భాగంగానే బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం అభివృద్ధికి రూ.324 కోట్లు, కాళేశ్వరం కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి రూ.198 కోట్లు, భద్రాచలం సీత రామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి రూ 276 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. పుష్కరాలు లోగో డిజైన్, ట్యాగ్ లైన్ పోటీలో ముందుగా వచ్చిన 100 మంది ఎంట్రీదారులకు సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. పుష్కరాల ప్రాధాన్యతను ప్రతిబింబించేలా పోటీలకు పంపే ఎంట్రీలు ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు-2027 లోగో, ట్యాగ్ లైన్ డిజైన్లను కలిపి ఈ నెల 30 లోపు పంపాలని ఔత్సాహికులకు సూచించారు. ఉత్తమమైన లోగో డిజైన్, ట్యాగ్ లైన్ పంపిన ముగ్గురు ఔత్సాహికులకు బహుమతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. మొదటి బహుమతిగా రూ.ఒక లక్ష, రెండవ బహుమతిగా రూ.50 వేలు, మూడవ బహుమతిగా రూ.25 వేలు నగదు అందజేయనున్నట్టు తెలిపారు. గోదావరి పుష్కరాలు-2027 లోగో, ట్యాగ్ లైన్ లను కలిపి [email protected] అనే మెయిల్ కు నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంపాలని కోరారు. పోస్టల్ లేదా నేరుగా కూడా హైదరాబాద్ బొగ్గులకుంట లో ఉన్న రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కూడా అందజేయవచ్చని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ఔత్సాహికులందరూ లోగో డిజైన్, ట్యాగ్ లైన్ పోటీలకు ఎంట్రీలు పంపవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికను తెలియజెప్పే విధంగా కళాత్మకత, జిజ్ఞాస, సృజనాత్మకతతో గోదావరి పుష్కరాలు లోగో డిజైన్ తో పాటు గరిష్టంగా ఐదు పదాలలో ట్యాగ్ లైన్ ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ ఎం. హన్మంతరావు, జేఎన్ఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎ.రేణుక,కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.ఎల్. ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)