వ్యర్థాలనే సంపదగా మార్చిన అద్భుతం
రాష్ట్ర పట్టణాలకు ఖమ్మం దిక్సూచి
రెండు దశాబ్దాల విషపూరిత పొగకు చెక్
ఊపిరి పీల్చుకున్న దానవాయిగూడెం, రామన్నపేట
బయో మైనింగ్‌తో శాశ్వత విముక్తి
కమిషనర్ ప్రత్యేక కార్యాచరణ
రీసైక్లింగ్‌తో ఆదాయ వనరులుగా మారిన వ్యర్థాలు
ప్రజా భాగస్వామ్యంతోనే ఈ విజయం శాశ్వతం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రెండు దశాబ్దాల దుర్వాసనకు చెక్ పెడుతూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరికొత్త పచ్చటి చరిత్రకు శ్రీకారం చుట్టారు. విషపూరిత పొగతో ఉక్కిరిబిక్కిరైన దానవాయిగూడెం, రామన్నపేట గ్రామాల ప్రజలు నేడు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు. చెత్త గుట్టల స్థానంలో విరబూసిన హరితవనం ప్రజా ఆరోగ్యానికి కొత్త ఊపిరి పోస్తోంది. వ్యర్థాలనే సంపదగా మార్చిన బయో మైనింగ్ ప్రయోగం ఖమ్మం నగర పారిశుధ్య ముఖచిత్రాన్నే మార్చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా సాధించిన ఈ అద్భుత విజయం నేడు యావత్ పట్టణాలకు దిక్సూచిగా నిలిచింది.
ఖమ్మం నగర శివార్లలోని దానవాయిగూడెం, రామన్నపేటకు ఆనుకుని ఉన్న 38 ఎకరాల డంపింగ్ యార్డ్ సుమారు రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలకు తీరని వేదన మిగిల్చింది. 2003-04లో ఇంటి స్థలాల పంపిణీ తర్వాత ఈ ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు నివాసం ఏర్పరచుకున్నాయి. ఆ తర్వాత 2011లో మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారి పరిధి విస్తరించడంతో చెత్త సమస్య మరింత తీవ్రమైంది. 60 డివిజన్ల నుంచి ప్రతిరోజూ వందలాది టన్నుల వ్యర్థాలు ఇక్కడ పోగుపడటం వల్ల దుర్వాసన, కాలుష్యం, పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొగ, దుమ్ము కారణంగా శ్వాసకోస సమస్యలు, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధుల బారిన పడి వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోయారు. దాంతో డంపింగ్ యార్డ్ తరలించాలని స్థానికులు అనేక ధర్నాలు, వినతులు చేసినా గతంలో ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించలేదన్న ఆవేదన ప్రజల్లో వ్యక్తమైంది.
నిరంతరాయంగా చెత్తను వేరుచేయడం
ఈ దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఖమ్మం కార్పొరేషన్ బయో మైనింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురావడం ఒక కీలక మలుపుగా నిలిచింది. 2021లో టెండర్ ప్రక్రియ మొదలై 2022లో పనులు ప్రారంభమైనా మొదట్లో ఆశించిన వేగం కనిపించలేదు. అయితే కార్పొరేషన్ కమిషనర్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగి, అంతర్గత సిమెంట్, గ్రావెల్ రోడ్లు, డ్రయినేజీలు నిర్మించడంతో 2024 నుంచి బయో మైనింగ్ ప్రక్రియ వేగవంతమైంది.
రీసైక్లింగ్‌తో ఆదాయ వనరులుగా వ్యర్థాలు
బయో మైనింగ్ ద్వారా మూడేండ్లలో భారీ స్థాయిలో లెగసీ వేస్ట్‌ను ప్రాసెస్ చేయడం నగర పారిశుధ్య చరిత్రలో పెద్ద ముందడుగు. ప్లాస్టిక్, కార్డ్‌బోర్డ్, పేపర్, గాజు వంటి వ్యర్థాలను వేరు చేసి రీసైక్లింగ్‌కు పంపడం, మరికొన్ని వ్యర్థాలను సిమెంట్, ఇతర కర్మాగారాలకు తరలించడం, మట్టిని లెవెలింగ్‌కు వినియోగించడం వంటి చర్యలతో వ్యర్థాల నిర్వహణకు కొత్త అర్థం దొరికింది. వేరు చేసిన వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ, రోడ్ల అవసరాలకు ఉపయోగపడే పదార్థాల ఏర్పాటు వంటి ప్రక్రియలు చెత్తను వనరులుగా మార్చగలవన్న నమ్మకాన్ని బలోపేతం చేశాయి. ఒకప్పుడు దుర్వాసన, పొగతో నిండిన ప్రాంతంలో ఇప్పుడు పచ్చదనం కనిపిస్తుండటంతో స్థానిక నివాసితులు, రోడ్డుపై ప్రయాణించే వారు ఊరట చెందుతున్నారు.
చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నాం
మున్సిపల్ ట్రాక్టర్లు, ఆటోల ద్వారా వచ్చే చెత్తను ముందుగా విభజించి, అందులోని ప్లాస్టిక్, కార్డ్‌బోర్డ్, పేపర్, గాజు సీసాలు వంటి విలువైన వస్తువులను రీసైక్లింగ్‌కు పంపుతున్నాం. మిగిలిన వ్యర్థాలను నిర్దేశిత ప్రాంతంలో డంప్ చేస్తున్నాం. 20 ఏండ్లుగా నగరంలో పేరుకుపోయిన చెత్తను మూడేండ్లుగా ‘క్యూబ్స్ బయో మైనింగ్’ సంస్థ ద్వారా ప్రాసెస్ చేస్తున్నాం. ఇప్పటివరకూ 2,62,000 మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్‌ను క్లియర్ చేశాం. చెత్తను తొలగించిన 10 ఎకరాల స్థలంలో మొక్కలు నాటడంతో పాటు, మరో 15 ఎకరాలను క్లియర్ చేసి కొత్త వ్యర్థాల నిర్వహణ కోసం సిద్ధం చేస్తున్నాం. అదనంగా మరో 38 వేల నుంచి 39 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేయడానికి అనుమతి పొంది పనులు కొనసాగిస్తున్నాం. అంతేకాకుండా నగరంలో ఉత్పత్తయ్యే రోజువారీ చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసేందుకు త్వరలోనే ‘ఫ్రెష్ వేస్ట్ మేనేజ్‌మెంట్’ టెండర్లు కూడా పిలిచాం.
శ్రీనివాస్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్






కామెంట్‌లు (0)