ఫిర్యాదుల పరిష్కారంలో అనవసర జాప్యాన్ని సహించం
ఏటీఆర్‌తో ప్రగతి సమీక్ష చేపట్టాలి : రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మెన్, సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ కలెక్టరేట్‌లో టోకెన్ విధానం అమలుకు ఆదేశం
ప్రజావాణిలో 333 అర్జీల స్వీకరణ.. 282 గృహ నిర్మాణ వినతులే
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజల ఆశలు, నమ్మకాలను నిలబెట్టేలా ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మెన్, సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి వినతులను స్వీకరించారు.
నిరంతర పర్యవేక్షణ.. గడువులోగా పరిష్కారం
అనంతరం వైస్ చైర్మెన్ మాట్లాడుతూ.. కేవలం అర్జీలను స్వీకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించడంతోనే బాధ్యత ముగిసినట్టు భావించరాదని, ప్రతి ఫిర్యాదుపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులపై సంబంధిత శాఖలు తప్పనిసరిగా చర్యలు తీసుకుని, యాక్షన్ టేకెన్ రిపోర్టులు (ఏటీఆర్) తెప్పించుకుని పురోగతిని సమీక్షించాలన్నారు. పెండింగ్ అర్జీల తీవ్రత, ప్రాధాన్యత ఆధారంగా గడువులు నిర్ణయించుకుని, తక్షణమే పరిష్కరించగలిగే వాటిని వెంటనే, ఇతర సమస్యలను నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని చెప్పారు. అనవసర జాప్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించరాదన్నారు. ముఖ్యంగా గృహ నిర్మాణం, విద్యుత్, గృహజ్యోతి, 2బీహెచ్‌కే ఇండ్లు, వివిధ రకాల పింఛన్ల విభాగాల్లో పెండింగ్ దరఖాస్తులను తగ్గించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అర్జీదారుల పట్ల సున్నితత్వం, సహనం, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని, ప్రతి ఒక్కరికీ సమయం కేటాయించి శ్రద్ధగా విని, వీలైతే అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
కలెక్టరేట్‌లో టోకెన్ విధానం
ప్రజావాణికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నందున హైదరాబాద్ కలెక్టరేట్‌లో టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టి, క్రమబద్ధంగా అర్జీలు స్వీకరించాలని విజయలక్ష్మి సూచించారు. ప్రజలందరికీ అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలు ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే సీఎం ప్రజావాణిని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాభవన్‌లో ఉదయం 9 గంటల నుంచి టోకెన్లు జారీ చేసి, రోజుకు 500 మంది వరకు వినతులు స్వీకరించేలా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని శాఖల నోడల్ అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను వింటారని వివరించారు. కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహణ, ప్రజలకు కల్పించిన సౌకర్యాలపై జిల్లా కలెక్టర్‌ను ఆమె అభినందించారు.
333 అర్జీల స్వీకరణ..
విజయలక్ష్మి చేసిన సూచనలను అమలు చేసి ప్రజావాణి నిర్వహణను మరింత మెరుగుపరుస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. సోమవారం ప్రజావాణిలో మొత్తం 333 అర్జీలు స్వీకరించగా, అందులో గృహ నిర్మాణం, 2బీహెచ్‌కేకు సంబంధించి 282, ఇతర శాఖలకు సంబంధించి 26, రెవెన్యూ శాఖకు సంబంధించి 25 అర్జీలు ఉన్నాయని తెలిపారు. ఈ అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జితేందర్ రెడ్డి, డీఆర్వో డాక్టర్ నారాయణ, హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి, ఏవో వెంకటరామిరెడ్డి, సీపీవో డాక్టర్ సురేందర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు అశన్న (బీసీ), ప్రవీణ్ (ఎస్సీ), సదానందం (ఎస్టీ), ఇలియాస్ (మైనారిటీ), రాజేందర్ (మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం), డీఈవో ఎస్. యాదయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్, పౌరసరఫరాల అధికారి కె. శ్రీనివాస్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)