బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ షాపింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :
టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరిక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ సైబర్ సేఫ్టీ అడ్వైజరీ జారీ చేసిందని ఆ విభాగం డీజీపీ శిఖా గోయల్ సోమవారం తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, మోసపూరిత ప్రకటనలు, ఫిషింగ్ లింకుల ద్వారా ప్రజలను మోసం చేసి డబ్బులు, వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలిస్తున్నారని తెలిపారు. నకిలీ పేమెంట్ లింకులు, క్యూఆర్ కోడ్ల ద్వారా అనధికార లావాదేవీలు జరిపిస్తున్నారని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన వెబ్‌సైట్లు, అధికారిక యాప్‌ల ద్వారా మాత్రమే కొనుగోళ్లు చేయాలని కోరారు. లింకులపై క్లిక్ చేసే ముందు, చెల్లింపులు చేసే ముందు వెబ్‌సైట్ యూఆర్‌ఎల్‌ను సరిచూసుకోవాలని సూచించారు. నమ్మశక్యం కాని ఆఫర్లు, ఫ్లాష్ సేల్స్, పరిమిత కాలపు ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని తెలిపారు. ఓటీపీ,యూపీఐ,పీఐన్,సీవీవీ ఇతర బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ వెల్లడించకూడదని సూచించారు. అనుమానాస్పద లింకులు, క్యూఆర్ కోడ్లకు దూరంగా ఉండాలని కోరారు. ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ ఆర్థిక మోసానికి గురైన బాధితులు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని టీజీసీఎస్‌బీ సూచించింది.






కామెంట్‌లు (0)