Magazines

సహకార ఎన్నికలపై వివరాలివ్వండి

14 నిమిషాల క్రితం

Provide details regarding the cooperative elections.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్‌) చివరిసారిగా ఎప్పుడు ఎన్నికలు నిర్వహించారనీ, ఆ తర్వాత ఎన్నికల కోసం తీసుకున్న చర్యలేమిటో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్‌ ఇన్‌ఛార్జీ కమిటీలను కొనసాగించడానికి కారణాలను అఫిడవిట్‌లో పేర్కొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసా య, సహకార శాఖ ముఖ్యకార్యదర్శులకు సోమ వారం నోటీసులు జారీ చేసింది. పాత కమిటీల చైర్మెన్లను తొలగించి కొత్తవారిని నియమిస్తూ అక్టోబర్‌ లో జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ఎనిమిది మంది దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ‌వచ్చేనెల రెండో తేదీకి వాయిదా వేసింది.

బాధిత భార్యకు రూ.2 లక్షల పరిహారం

2001లో మెదక్‌ జిల్లా చేగుంట మండలం చెట్ల తిమ్మాయపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన బాలనరసయ్య భార్య పొన్న వెంకటమ్మకు రూ.రెండు లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తీర్పు ప్రతి అందిన ఎనిమిది వారాల్లోగా చెల్లింపులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తన భర్తను పోలీసులు కాల్చిచంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని వెంకటమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామన్న పోలీసుల వాదనకు ఆధారాలు లేవని హైకోర్టు సోమవారం పేర్కొంది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ మార్గదర్శకాలను పాటించలేదనీ, స్వతంత్ర దర్యాప్తు జరిపించడంలోనూ విఫలమయ్యారని తప్పుబట్టింది. రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం చట్టవిరుద్ధంగా ప్రాణాలు తీసే అధికారం ప్రభుత్వ సంస్థలకు లేదని స్పష్టం చేసింది.

విద్యాశాఖ తీరుపై హైకోర్టు అసంతృప్తి

డీఎస్సీ-2002 హిందీ పండిట్‌ గ్రేడ్‌-2 నియామకాలపై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లు అసమగ్రంగా ఉన్నాయని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల పిటిషనర్లకు సంబంధించి సమర్పించిన వివరాలు సరిపోవని పేర్కొంది. మెదక్‌, వరంగల్‌ జిల్లాల అభ్యర్థుల విషయంలో డీఈవోలు చేసిన సిఫారసులను సమర్పించాలని ఆదేశించింది. 2022లో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో సంధ్య తదితరులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా వ్యక్తిగతంగా హాజరయ్యారు. డీఈవోలు సిఫారసులు చేసినట్లు చెబుతుండగా, ప్రభుత్వం మాత్రం ఆ వివరాలు లేవంటోందని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలతో తదుపరి విచారణ ఈనెల 30న ఉంటుందనీ, అఫిడవిట్‌ సమర్పించాలని విద్యాశాఖను ఆదేశించింది.

అండాల కేసుల్లో బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ

అక్రమ అండాల సేకరణకు సంబంధించి మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో నమోదైన ఎనిమిది కేసుల్లో 30 మందికిపైగా నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టేసింది. మహిళలను ఏజెన్సీల ద్వారా తీసుకొచ్చి వసతి గృహాల్లో ఉంచి హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇస్తున్నా రన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ దశలో కేసు పూర్వాపరాల్లోకి వెళ్లలేమని పేర్కొంది. అండాల సేకరణకు ముందు, తర్వాత నిర్వహించాల్సిన వైద్య పరీక్షలు, విధివిధానాలను పాటించాల్సిన బాధ్యత వైద్యులపైనే ఉందని స్పష్టం చేసింది. వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చకుండా నైతిక విలువలను కాపాడాలని వ్యాఖ్యానిస్తూ డాక్టర్లు, ఇతర నిందితుల బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్