ఓ యువకుడి చేతిలోకి దిగిన ఇనుప రాడ్డు
గంటసేపు నరకయాతన
వెల్డింగ్ కట్టర్‌తో తొలగింపు ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
మద్యం మత్తులో హాస్టల్‌లోకి వెళ్లేందుకు గేటు దూకబోయిన ఓ యువకుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. పట్టుతప్పి కింద పడటంతో గేటుపై ఉన్న పదునైన ఇనుప రాడ్డు నేరుగా చేతిలోకి దిగింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మణికంఠ అనే యువకుడు మద్యం మత్తులో తాను ఉంటున్న హాస్టల్‌లోకి వెళ్లేందుకు గేటు దూకే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పట్టుతప్పి కింద పడటంతో గేటు పైభాగంలో ఉన్న పదునైన ఇనుప రాడ్డు అతని చేతిలో దిగింది. రాడ్డు చేతిలోనే ఇరుక్కుపోవడంతో తీవ్ర నొప్పితో కదలలేని స్థితిలో దాదాపు గంటసేపు విలవిల్లాడాడు. అతని అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెల్డింగ్ కట్టర్ సహాయంతో గేటు ఇనుప రాడ్డును కట్ చేసి, చేతిలో ఇరుక్కున్న రాడ్డు భాగంతోనే మణికంఠను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.





కామెంట్‌లు (0)