హైదరాబాద్లో 27వ అఖిల భారత పోలీసు బ్యాండ్ పోటీలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రంగా రెడ్డి జిల్లా సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో 27వ అఖిల భారత పోలీసు బ్యాండ్ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. నవంబరు 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతీయస్థాయి పోటీలను అఖిల భారత పోలీసు క్రీడా నియంత్రణ మండలి, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ నిర్వహిస్తోంది.
ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 25కు పైగా బ్యాండ్ బృందాలు పాల్గొంటున్నాయి. సుమారు 1,500 మంది బ్యాండ్ సిబ్బంది తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బ్యూగిల్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.... పోలీసు బ్యాండ్లు కేవలం సంగీతాన్ని ప్రదర్శించే బృందాలు మాత్రమే కాదని, ఆయా బలగాల క్రమశిక్షణ, గుర్తింపు, గౌరవం, ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. జాతీయ వేడుకలు, కవాతులు, గౌరవ వందనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వంటి ముఖ్య కార్యక్రమాల్లో పోలీసు బ్యాండ్ల పాత్ర ఎంతో కీలకమని వివరించారు. సంగీతానికి భాష, ప్రాంతం, సంస్కృతి వంటి భేదాలు లేవని, ప్రజలకు పోలీసులకు మధ్య అనుబంధాన్ని పెంపొందించే శక్తివంతమైన మాధ్యమమని అన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు సంగీతంలో నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు బ్యాండ్ సిబ్బంది నిరంతరం సాధన చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి పోటీలు వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ బలగాల మధ్య స్నేహభావం, ఆరోగ్యకరమైన పోటీ తత్వం, వృత్తి నైపుణ్యం, జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.
పోలీసు బ్యాండ్లు కవాతుల్లో సమన్వయం, క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ప్రజా కార్యక్రమాలు, పాఠశాలలు, పండుగలు, సామాజిక వేడుకల్లో ప్రదర్శనల ద్వారా పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తున్నాయని చెప్పారు.
జాతీయ ఏక్తా దివాస్ సందర్భంగా అక్టోబర్ 31న గుజరాత్ లోని కవడియలో జరిగిన కవాతులో ఎన్ సీ సీ విద్యార్థులు చేసిన కవాతు అందర్నీ ఆకర్షించిందన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు హైదరాబాద్ సంస్కృతిని సంప్రదాయాలను చూడాలంటూ హైదరాబాద్ బిర్యానీ, హలీం తో పాటుగా హైదరాబాదులోని చారిత్రక ప్రదేశమైన గోల్కొండ, సాలార్జుంగ్ మ్యూజియం, హైదరాబాద్ సిటీ, హైటెక్ సిటీ, రామప్ప ఇలాంటి ప్రదేశాలను సందర్శించాలని సూచించారు.
ఐక్యతకు ప్రతీకగా సంయుక్త కవాతు
ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా వివిధ రాష్ట్రాల పోలీసు, కేంద్ర బలగాలకు చెందిన బ్యాండ్ సిబ్బంది ఒకే బృందంగా పాల్గొనే సంయుక్త కవాతు నిర్వహించనున్నారు. భిన్నత్వంలో ఏకత్వం, దేశసేవలో సమష్టి కృషికి ఇది ప్రతీకగా నిలవనుంది. 1999లో తొలిసారిగా అఖిల భారత పోలీసు బ్యాండ్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన సీఆర్పీఎఫ్, మరోసారి ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను నిర్వహించడం విశేషం. 2023 నుంచి మహిళా సిబ్బంది భాగస్వామ్యం కూడా పెరుగుతూ వస్తోంది.
నగరవాసుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు
ప్రజలకు పోలీసు బ్యాండ్ల సంగీత ప్రతిభను పరిచయం చేసేందుకు ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. నవంబరు 17న సాయంత్రం 5.30 గంటలకు హైటెక్స్ సిటీలోని శిల్పారామంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సమక్షంలో, నవంబరు 18న సాయంత్రం 5.30 గంటలకు లుంబినీ పార్కులో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సమక్షంలో బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. నగరవాసులు, పర్యాటకులు ఈ ప్రదర్శనలను వీక్షించే అవకాశం కల్పించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ పోటీలు దేశ పోలీసు, కేంద్ర సాయుధ బలగాల సంగీత వారసత్వం, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యం, జాతీయ సమైక్యతను చాటిచెప్పనున్నాయి. కార్యక్రమంలో ఐజీ టి. విక్రమ్, ఐజీ గోపాలకృష్ణ, ఐజీ విపుల్ కుమార్, డీఐజీ వీరాజు ఐ, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి, మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఏసీపీ చక్రపాణి తదితరులు ఉన్నారు. సీఆర్పీఎఫ్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, వివిధ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)