ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
నవతెలంగాణ-హైదరాబాద్ :
8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లు, కమిషనర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తెలంగాణ వేదికగా జరుగనున్న సంగతి తెలిసిందే. యూత్ గేమ్స్ హైదరాబాద్‌లోని పలు స్టేడియాలతో పాటు హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వేదికగా జరుగనున్నాయి. ఈ క్రీడల్లో పోటీపడేందుకు దేశవ్యాప్తంగా సుమారు 8 వేల మంది క్రీడాకారులు, అధికారులు, సహాయక సిబ్బంది రాష్ర్టానికి రానున్నారు. యూత్ గేమ్స్ సంబురాలకు విస్తృత ప్రచారం కల్పించటంతో పాటు యువత భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంజయ్ జాజు సూచించారు. 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగ్‌లు, బెలూన్లతో పాటు మస్కట్, లోగోలను ప్రదర్శించాలి.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో ప్రత్యేక ప్రచార ఏర్పాట్లు చేయాలి. క్రీడల ప్రాముఖ్యతను తెలిపేలా టార్చ్ ర్యాలీలు నిర్వహించాలి. క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలి. క్రీడాకారుల రవాణాతో పాటు క్రీడలను వీక్షించేందుకు స్కూల్స్ నుంచి విద్యార్థులను స్టేడియాలను తీసుకొచ్చేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలి. క్రీడాకారులకు నాణ్యమైన వసతి ఏర్పాట్లు చేయాలి. యూత్ గేమ్స్‌పై అవగాహన కల్పించేందుకు మంత్రి, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ వంటి వారితో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని' అధికారులను సీఎస్ ఆదేశించారు. క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలా దేవి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, జిహెచ్‌ఎంసీ కమిషనర్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)