Magazines

ఏనుమాముల మార్కెట్‌లో కొనుగోళ్లు బంద్

13 నిమిషాల క్రితం

Enumamula market
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని వ్యాపారులు

నవతెలంగాణ కాశిబుగ్గ

​వరంగల్‌ ‌జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. తూకంలో తేడాలు చూపి రైతులను మోసం చేస్తున్నారంటూ అడ్తి సెక్షన్‌ అధ్యక్షులు లింగారెడ్డికి ఈ నెల 10న మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ నోటీసులు జారీ చేశారు. దాంతోపాటు ఈనెల 12న పత్తి వేలం పాట సమయంలో తన విధులకు ఆటంకం కలిగించడంతోపాటు దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడినట్టు లింగారెడ్డిపై ఏనుమాముల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సమావేశమై లింగారెడ్డికి మద్దతుగా సోమవారం నుంచి మార్కెట్లో కొనుగోలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలుగజేసుకొని ఆదివారం సాయంత్రం మార్కెట్ అధికారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులకు, అధికారులకు మధ్య సమస్యలు తలెత్తితే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ రైతులకు ఇబ్బంది కలిగే విధంగా కొనుగోళ్లను నిలిపివేయడం సరికాదని సూచించారు. కలెక్టర్ జోక్యంతో పంట కొనుగోళ్లు చేపడతామని హామీ ఇచ్చిన వ్యాపారులు మరోసారి సమావేశమై లింగారెడ్డికి మద్దతుగా సోమవారం కొనుగోళ్లు నిలిపివేశారు.

​ రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు : సోమిడి శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు

మార్కెట్‌లో సమస్యలు నిత్యం ఉండేవే. వ్యాపారులకు, మార్కెట్ అధికారులకు మధ్యన తలెత్తిన సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ పంట కొనుగోళ్లు నిలిపివేయడం సరికాదు. రైతు ప్రయోజనాలు ప్రథమ ప్రాధాన్యత ఉండాలి. పరస్పరం సమన్వయంతో వ్యవహరించాల్సిన వారు వివాదాలకు దిగితే చివరకు నష్టపోయేది రైతులే. ముందస్తు సమాచారం లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు మార్కెట్ బంద్‌తో ఇబ్బందులు పడుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్