భారీగా నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు
ముఖ్యఅతిథిగా హాజరు కానున్న కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాధన ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన దీక్షా దివస్‌ను ఈసారి భారీ స్థాయిలో నిర్వహించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సన్నాహాలు చేస్తున్నది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కరీంనగర్ జిల్లా అల్గునూరులో ఈనెల 29న భారీ స్ఫూర్తి సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
సభ నిర్వహణ, ఏర్పాట్లపై ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు గత వారం కేటీఆర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, జనసమీకరణ, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంపై చర్చించారు. అల్గునూరులో జరిగే సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సమష్టిగా పనిచేయాలని పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిపై ప్రత్యేక దృష్టి
ఈసారి దీక్షా దివస్ సభ నిర్వహణలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిని బీఆర్ఎస్ ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పెద్దపల్లి ప్రాంతంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆయా ప్రాంతాల నుంచి పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, క్రియాశీల కార్యకర్తలను పెద్ద సంఖ్యలో సభకు తరలించేలా కార్యాచరణ రూపొందించింది. ఇటీవల గోదావరిఖని ప్రాంతంలో సింగరేణిలో పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పార్టీ సంస్థాగత బలాన్ని సమన్వయం చేసుకుంటూ, స్థానిక నాయకులు, క్యాడర్‌ను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపాలని నాయకత్వం భావిస్తోంది.
ఉద్యమ చరిత్రను యువతకు చేరవేసేలా కార్యక్రమాలు
నవంబర్ 29కి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉన్నది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన ఆ చారిత్రాత్మక పోరాట ఘట్టాన్ని నేటి తరానికి గుర్తుచేసేలా దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
అల్గునూరులో ప్రధాన స్ఫూర్తి సభ నిర్వహించడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లోనూ దీక్షా దివస్ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణలు, కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, తెలంగాణ తల్లికి నివాళులు, అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ ఘట్టాలను ప్రతిబింబించే ఫొటో, వీడియో ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతోపాటు ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థి నాయకులు, మహిళా ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. రక్తదాన శిబిరాలు, ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలకూ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటించింది. ఈ సభ ద్వారా కార్యకర్తల మధ్య ఐక్యతకు దోహదపడాలని భావిస్తున్నది.






కామెంట్లు (0)