Magazines

దేశంలోనే అతి పెద్ద రైతాంగ ఉద్యమ సంస్థ ఏఐకేఎస్‌

05 నవంబర్, 2026

AIKS
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం

రైతాంగ హక్కుల కోసం నిరంతర పోరాటం : మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి

నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయ రంగ భవిష్యత్‌ కోసం ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభను నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల15 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్టు సంఘం జాతీయ నాయకులు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. 15న లక్ష మంది రైతులతో ఎన్‌‌జీ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్‌‌లో గురువారం నిర్వహించిన మహాసభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1.58 కోట్లకు పైగా సభ్యత్వంతో అఖిల భారత కిసాన్ సభ ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ ఉద్యమ సంస్థగా కొనసాగుతోందన్నారు.

సామ్రాజ్యవాదం, భూస్వామ్యానికి వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తూ రైతాంగ హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత కిసాన్ సభ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా అమలవుతున్న ఆర్థిక విధానాలు, అసమాన మార్కెట్ వ్యవస్థ, బలహీనమైన సామాజిక భద్రత, ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు సమగ్ర విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎస్ జాతీయ మహాసభకు దేశం నలుమూలల నుంచి 950 మందికి పైగా ప్రతినిధులు, పరిశీలకులు, నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. 14న నిర్వహించే రైతు ఎగ్జిబిషన్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించిన చారిత్రక పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, వ్యవసాయ పరిస్థితులను ప్రతిబింబించే అంశాలను ప్రదర్శించ నున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి వీరపల్లి వెంకటేశ్వర్లు, మహిళా కన్వీనర్ కందాల ప్రమీల, వివిధ ప్రజాసంఘాల నాయకులు నారి ఐలయ్య, డబ్బి కార్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్