మా ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తారు : వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని స్పష్టం చేశారు. ఈ బిల్లుపై తమ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందని తెలిపారు. దక్షిణ భారతదేశ పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎటువంటి తగ్గుదల ఉండొద్దని కోరారు. తెలంగాణకు జరిగే ఏ అన్యాయాన్నీ సహించేది లేదని హెచ్చరించారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రస్తుత 24 శాతం వాటాను కాపాడాలని తాము నిరంతరం డిమాండ్ చేస్తున్నామని వివరించారు. 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తి మారకుండా రక్షణ కల్పిస్తూ, సీట్లను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదన తమ ప్రధాన ఆందోళనను పరిష్కరిస్తోందని తెలిపారు. దీనివల్ల తెలంగాణ లోక్‌సభ స్థానాలు 17 నుండి 26కు పెరుగుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేస్తారని వివరించారు. మహిళా రిజర్వేషన్లకు తాము ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చామనీ, దాని అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)