దేశ విదేశీ ప్రతినిధుల రాక
ప్రపంచ సమస్యలపై మేధోమథనం
ఏఐ నుంచి వాతావరణ మార్పుల వరకు
విస్తృత చర్చలు
ప్రజాస్వామ్యం, ఆర్థిక అసమానతలు, సామాజిక న్యాయంపై పలు అభిప్రాయాలు
హాజరైన 70 దేశాల ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలు.. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు.. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు.. వాతావరణ మార్పులతో తలెత్తుతున్న సమస్యలు.. వీటన్నింటిపై హైదరాబాద్ వేదికగా మేధోమథనం సాగింది. హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్-2.0లో భాగంగా శుక్రవారం పలు చర్చాగోష్టులు నిర్వహించారు. సుమారు 70 దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.కృత్రిమ మేధస్సు (ఏఐ), క్లౌడ్ క్యాపిటలిజం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులపై ప్రత్యేకంగా చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఉపాధి అవకాశాలు, ఆర్థిక అసమానతలు, డిజిటల్ రంగంలో పెరుగుతున్న ఆధిపత్యం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సాంకేతికత సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాల్సిన అవసరాన్ని చర్చించారు.ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక సహకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమాన అవకాశాలు, ఉత్తర-దక్షిణ దేశాల మధ్య సంబంధాలు, దక్షిణ-దక్షిణ సహకారం వంటి అంశాలపై ప్రతినిధులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అసమానతలను తగ్గించేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చ సాగింది. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, భవిష్యత్ తరాలకు ఎదురయ్యే ముప్పులు చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతికి నష్టం కలగకుండా చూడటం, పర్యావరణహిత విధానాలను అమలు చేయడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఎన్నికల పారదర్శకత, అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు, రాజకీయాల్లో యువత భాగస్వామ్యం, మహిళలకు సమాన అవకాశాలు తదితర అంశాలపై చర్చాగోష్టులు నిర్వహించారు. అంతర్జాతీయ సంస్థలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని పలువురు ప్రస్తావించారు.
వీటితోపాటు సమాచార రంగంలో వస్తున్న మార్పులు, సామాజిక మాధ్యమాల ప్రభావం, తప్పుడు వార్తల వ్యాప్తి, సమాచార విశ్వసనీయత వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ప్రజాస్వామ్య పరిరక్షణలో స్వేచ్ఛాయుత మీడియా పాత్రను వివరించారు. సమ్మిట్‌లో భాగంగా తెలంగాణ ప్రగతి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపైనా ప్రత్యేక చర్చలు కొనసాగాయి. ఫ్యూచర్ సిటీ, పట్టణీకరణ, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు, సహకార సమాఖ్య విధానం, యువత, క్రీడలు, రాజకీయాలు తదితర అంశాలను చర్చకు తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి నమూనా, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.వివిధ దేశాల అనుభవాలు, ఆలోచనలు ఒకే వేదికపైకి రావడంతో భారత్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చల్లో సమ్మిట్‌లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు స్వాగతం పలుకగా చర్చల్లో విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్క లంబ, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క,అడ్లూరి లక్ష్మన్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)