రెండో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలి
అటవీ సంపదను అదానీ, అంబానీకి అప్పగించేందుకు బీజేపీ యత్నం
గ్రామసభ తీర్మానం లేకుండా ఏ గ్రామాన్నీ ఖాళీ చేయం
ఆదివాసీల అస్తిత్వానికి భంగం వాటిల్లితే ఎర్రజెండా అండగా పోరాటం
కుమురంభీం, రాంజీగోండ్ స్ఫూర్తితో ఉద్యమాలు
టీఏజీఎస్ రాష్ట్ర 4వ మహాసభ బహిరంగ సభలో
ఏఏఆర్ఎం జాతీయ వైస్ చైర్పర్సన్ బృందాకరత్
లుంబిని దీక్ష భూమి మైదానానికి హాజరైన వేలాది మంది గిరిజనులు
ఆసిఫాబాద్లో డప్పులు, మేళాలతో భారీ ర్యాలీ
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం అటవీ సంపదను అదానీ, అంబానీలకు అప్పగించే కుట్ర చేస్తోంది.. లక్షలాది మంది ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తోంది.. కానీ, ఆదివాసీ గ్రామాల్లో తీర్మానం చేయకుండా ఒక్క గ్రామాన్నీ ఖాళీ చేయం.. హక్కుల పరిరక్షణ, భూముల పట్టాల కోసం ఆదివాసీలు చేస్తున్న పోరాటం మరో స్వాతంత్ర్య పోరాటం లాంటిది ’’ అని ఆదివాసీ అధికారి రాష్ట్రీయ మంచ్(ఏఏఆర్ఎం) జాతీయ వైస్ చైర్పర్సన్ బృందాకరత్ అన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజిఎస్) రాష్ట్ర 4వ మహాసభ సందర్భంగా శనివారం కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిం చారు. ఆదివాసీల ఓట్లతో గద్దెనెక్కిన మోడీ సర్కార్ వారికున్న చట్టాలను, హక్కులను విస్మరిస్తోందని అన్నారు. జనగణనలో ఇతర మతాలకు, సామాజిక తరగతులకు ఇచ్చిన గుర్తింపు వీరికి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వంద్వ విధానాల వల్ల ఆదివాసీల ఆత్మగౌరవం దెబ్బతింటోందని, వారి మనుగడకు భంగం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడే మోడీ ఆదివాసీలకు అదే రాజ్యాంగం కల్పించిన హక్కుల విషయానికొస్తే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టం వచ్చి 20 ఏండ్లు గడుస్తున్నా కనీసం 50 శాతం మందికి కూడా భూ పట్టాలు రాలేదంటే ఆదివాసీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని విమర్శించారు. 
ఆదివాసీలు అనాదిగా సాగు చేసుకుంటు న్న భూములను లాక్కోవడమే కాక, యువతకు ఉద్యోగావ కాశాలు కల్పించడంలో అన్యాయం చేస్తున్నాయని అన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న పెసా, అటవీ హక్కుల చట్టాలను అమలు పర్చకుండా వారి మనుగడకే భంగం కల్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికోసం ఎర్రజెండా అండగా ఉంటుందనీ, పార్లమెంటు సాక్షిగా ఆదివాసీల పక్షాన పోరాడుతుందని భరోసా కల్పించారు. వారిని జై ఆదివాసీ అని సగర్వంగా అంటూ అండగా నిలిస్తే.. బీజేపీ మాత్రం వనవాసీ అని అంటోందని విమర్శించారు. ఆదివాసీలు అంటే మానవ మనుగడకు పునాది లాంటి వారని, వారిని వనవాసీ అనడం ఎంతవ రకు సమంజసమని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే 8లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఎకరానికీ పట్టా ఇవ్వలేదని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 340 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించడానికి జీఓ 49ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలైన విద్యా, వైద్యం, రవాణా లేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆశ్రమ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం వారు అభివృద్ధి చెందలేరని, కుమురం భీం, రాంజీగోండ్ పోరాట స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఏజీఎస్ రాష్ట్ర 4వ రాష్ట్ర మహాసభ సాక్షిగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి అశోక్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రజాసంఘాల రాష్ట్ర, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.
పోరాటాలతోనే హక్కులు సాధ్యం :మిడియం బాబురావు, టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాన్ని 5వ షెడ్యూల్ భూభాగంగా ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు ఐటీడీఏలు అందుబాటులోకి వచ్చాయని టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు తెలిపారు. ఆదివాసీల గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించేలా చట్టాలు వచ్చాయ న్నారు. అటవీపై ఉన్న హక్కులను కాపాడు కోవడానికి జల్, జంగల్, జమీన్ నినాదంతో చేపట్టిన పోరాటం ఫలితంగా పెసా, 1/70 లాంటి చట్టాలను సాధించుకున్నామని గుర్తు చేశారు. కుమురం భీ, రాంజీగోండ్ స్ఫూర్తితో ‘మావనాటే మావసాటే’ నినాదంతో ఇండ్లు, రోడ్లు సౌకర్యాల కల్పనకు అనేక పోరాటాలు చేశామని చెప్పారు.
ఆదివాసీలను ఐక్యం చేయడానికే టీఏజీఎస్ : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్
ఆదివాసీల హక్కుల సాధనకు టీఏజీఎస్ చేస్తున్న పోరాటంలో భాగంగానే కుమురంభీం పురిటి గడ్డ అయిన ఇక్కడ రాష్ట్ర 4వ మహాసభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ తెలిపారు. 5వ షెడ్యూల్ భూభాగంలో జీవిస్తున్న ఆదివాసీలకు 90 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన జీఓ 3ను రద్దు చేసి ఆదివాసీ యువతకు పాలకులు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వారికి జీవనాధారం అయినటువంటి తునికాకు కల్లాలను తెరిపించేందుకు టీఏజీఎస్ పోరాడుతోందని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఉండాల్సిన అన్ని విభాగాలకూ సంబంధించిన శాఖలు పనిచేసేలా ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజనుల భారీ ప్రదర్శన
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఆసిఫాబాద్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన మెయిన్ మార్కెట్, వివేకానంద చౌక్, గాంధీ చౌక్, బాబూ జగ్జీవన్ రాం చౌక్, అంబేద్కర్ చౌక్, కుమురంభీం చౌక్ మీదుగా లుంబినీ దీక్ష భూమి వరకు సాగింది. ఈ ర్యాలీని ఆదివాసీ అధికారి రాష్ట్రీయ మంచ్ జాతీయ వైస్ చైర్పర్సన్ బృందాకరత్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అటవీ హక్కుల చట్టం -2006 రూపకర్త మిడియం బాబురావు ప్రారంభించారు. ర్యాలీకి ముందు భాగంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గుస్సాడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శనలో టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, పి.జయలక్ష్మి, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశాలత, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, టీఏజీఎస్ జిల్లా అధ్యక్షులు మాలశ్రీ, ప్రధాన కార్యదర్శి నేర్పెల్లి అశోక్, ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, సిర్పూర్ పేపర్ మిల్లు యూనియన్ నాయకుడు కూశన రాజన్న తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)