15 నుంచి 18 వరకు రైతు సంఘం అఖిల భారత మహాసభలు
జయప్రదం చేయాలి : ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్
కార్పొరేట్లకు పంట పొలాలు కట్టబెడుతున్న పాలకులు
భూమిని కాపాడుకోవడమే రైతుకు సవాల్‌గా మారింది
ఎంఎస్ స్వామినాథన్ సిపార్సులను అమలు చేయాలి
15న నల్లగొండ రైతు సభకు తరలిరండి
నవతెలంగాణ-మహబూబాబాద్
దేశంలో కార్పొరేట్ తిమింగలాలు వ్యవసాయ రంగాన్ని కబలించేందుకు కుట్రపూరితంగా ముందుకు వస్తున్నాయని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ వారికి వత్తాసు పలుకుతున్నాడని, దేశ రైతాంగాన్ని, భూములను, వ్యవసాయ రంగాన్ని రక్షించుకునేందుకు ప్రజలు సంసిద్ధం కావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు నిర్వహిం చనున్న ఏఐకేఎస్ 36వ అఖిల భారత మహాసభల సందర్భంగా శుక్రవారం మహబూబాబాద్ లో ‘వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాలు- పరిష్కార మార్గాలు’ అనే అంశంపై రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునిగంటి రాజన్న అధ్య క్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏండ్లలో నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల తయారీలో కార్పొరేట్ సంస్థలు స్థిరపడ్డాయన్నారు. ఇప్పుడు భూములను కబలించేందుకు ముందుకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయకుండా పాలకవర్గాలు నిర్లక్ష్యంగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేత సుందరయ్య ప్రశ్నించిన నేపథ్యంలోనే నెహ్రూ ప్రభుత్వం దేశంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు వచ్చిందని అన్నారు. నేడు రైతాంగానికి భూమిని కాపాడు కోవడమే సవాల్ గా మారిందని తెలిపారు. దేశంలో 53.7 మంది దళితులకు 53.6 మైనార్టీలకు 53.1 శాతం గిరిజనులకు భూమి లేదన్నారు. ఇంతకాలం ప్రభుత్వ భూములను కార్పొరేట్లకు అప్పగించిన పాలకవర్గాలు, నేడు తాజాగా అభివృద్ధి, సంక్షేమం పేరుతో రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వే ప్రాజెక్టులు, ఆస్పత్రుల పేరుతో రైతుల భూములను కొల్లగొడుతున్నాయని విమర్శించారు.
ప్రభుత్వ నిబంధన ప్రకారం మూడు పంటలు, రెండు పంటలు పండే భూములను అభివృద్ధి సంక్షేమం పేరుతో సేకరించవద్దని అన్నారు. కేవలం పంటలు పండని భూములను సేకరించాలని, అత్యవసర మౌలిక సదుపాయాల కోసం అయితే ఏకపంట భూములను సేకరించవచ్చని తెలిపారు. అదికూడా మార్కెట్ రేట్ ప్రకారం మూడు రేట్లు అదనంగా ఇచ్చి తీసుకోవాలని అన్నారు. మానుకోట జిల్లాలో 22 మంది రైతులు చనిపోయారని, బాధిత రైతు కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని తెలిపారు. రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ పేరుతో బహుళ జాతి సంస్థలకు భూములను అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పాలకులు అభివృద్ధి ఉద్యోగాల పేరుతో కార్పొరేట్ సంస్థలకు భూములను ఎకరం ఒక్క రూపాయికే ఇవ్వడానికి సిద్ధమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల నుంచి తీసుకున్న సాఫ్ట్వేర్ కంపెనీలు కొంతకాలం నిరుద్యోగులకు ఉద్యోగ ఆశ చూపి ఆ తర్వాత అప్పనంగా వెళ్లగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాదిలో అమెజాన్ కంపెనీ 31,500 ఉద్యోగాలు గూగుల్ కంపెనీ 28వేల ఉద్యోగాలు మైక్రోసాఫ్ట్ కంపెనీ 60 వేల ఉద్యోగులను తొలగించిందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ నుంచి భూమిని అప్పనంగా తీసుకుంటూ ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. పాలక వర్గాలు దేశీయ ఎరువుల కర్మాగారాలను విత్తన కంపెనీలను ప్రోత్సహిస్తూ ఇక్కడి విత్తన తయారీ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ కార్పొరేట్ రంగాలకు ఎర్ర తివాచీ పరుస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల సూచనల మేరకే ఎమ్మెస్ స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. ప్రతిపక్షాల పోరాటాల ఫలితంగానే బ్యాంకుల జాతీయకరణ జరిగిందని, రైతులకు 40 శాతం వ్యవసారంగానికి రుణాలు ఇవ్వడానికి అందులో 18 శాతం పంట రుణాలు ఇవ్వడానికి ఒప్పందం జరిగిందని అన్నారు. పోరాటాల ఫలితంగానే రాష్ట్రంలో రుణమాఫీ జరిగిందని, ఉచిత విద్యుత్ అమల్లోకి వచ్చిందని అన్నారు.
భూములను కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతుందని అన్నారు. కార్పొరేట్ రంగాల నుంచి పాలకవర్గాల విధానాల నుంచి భూములను కాపాడుకునేందుకు రైతాంగం సిద్ధం కావాలన్నారు. ఈ నెల 15 నుంచి నల్లగొండ లో జరిగే రైతు సంఘ అఖిలభారత మహాసభలకు రైతులు భారీ సంఖ్యలో తరలిరావాలని 15న నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న, జిల్లా కోశాధికారి ఆకుల రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాదుల శ్రీనివాస్, అల్వాల వీరయ్య, నాయకులు సమ్మెట రాజమౌళి పాల్గొన్నారు.






కామెంట్లు (0)