హంగ్ తప్పదంటున్న సర్వేలు
విల్లింగ్టన్ : న్యూజిలాండ్ ప్రతినిధిసభకు (పార్లమెంటుకు) శనివారం ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ప్రాథమిక ఫలితాలు వెలువడతాయి. అయితే అధికారికంగా 27వ తేదీన తుది ఫలితాలను వెల్లడిస్తారు. విదేశాల్లో ఉన్న న్యూజిలాండ్ పౌరుల కోసం గత నెలలోనే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 120 స్థానాలు ఉన్న ప్రతినిధిసభలో మెజారిటీకి కనీసం 63 స్థానాలు అవసరమవుతాయి. ఎందుకంటే అక్కడ అమలులో ఉన్న మిక్స్‌డ్ మెంబర్ ప్రపోర్షనల్ (ఎంఎంపీ) విధానం కారణంగా కొన్నిసార్లు అదనపు స్థానాలు ఏర్పడి సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఇటీవల పదవీకాలం పూర్తయిన 54వ పార్లమెంటులో 123 సీట్లు ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కన్పించడం లేదు.
వివిధ సర్వేల ప్రకారం...క్రిస్టొఫర్ లక్సన్ నేత త్వంలోని అధికార నేషనల్ పార్టీకి 26.4 శాతం నుంచి 29.5 శాతం వరకూ ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన లేబర్‌పార్టీకి 28.4 శాతం నుంచి 30.7 శాతం ఓట్లు రావచ్చు. తాజా అంచనాల్లో కొన్ని చోట్ల లేబర్ పార్టీ అధిక్యతలో ఉంది. ఇక గ్రీన్ పార్టీ 13 శాతం నుంచి 16.4 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. యాక్ పార్టీకి పది శాతం, న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీకి 9 - 12 శాతం ఓట్లు రావచ్చు.
నేషనల్ ఫార్టీ, యాక్, న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీలు కలిసి మరోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 37.4 శాతం వరకూ అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు లేబర్ పార్టీ, గ్రీన్ పార్టీ, కొన్ని చిన్న పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ పార్టీ, లేబర్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్న నేపథ్యంలో చిన్న పార్టీలైన గ్రీన్, యాక్ట్, న్యూజిలాండ్ ఫస్ట్ కింగ్ మేకర్లుగా మారబోతున్నాయి.






కామెంట్‌లు (0)