నీ అంతుచూస్తా.. రూమ్‌కు తీసుకెళ్లి కొడతా అంటూ..
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ కు మంత్రి దామోదర రాజనర్సింహ వార్నింగ్
ఢిల్లీలోని హోటల్ వద్ద ఇతర ఎమ్మెల్యేలు, నాయకుల ముందే రచ్చరచ్చ
కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్
టీపీసీసీ అధ్యక్షుడితో పాటు, ఏఐసీసీకి ఎమ్మెల్యే ఫిర్యాదు
డీసీసీ పదవుల ఎంపిక విషయంలో వాగ్వివాదం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘ఏఐసీసీలో నీ ఇన్‌ఫ్లూయెన్స్ రోజురోజుకు పెంచుకుంటున్నావ్. నీ ఇష్టం ఉన్న వాళ్లకు డీసీసీ పదవులు ఇప్పించుకుంటావా..? నీ అంతు చూస్తా. రూమ్ లో వేసి కొడత బిడ్డ. రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తా’ అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార రాజనర్సింహా.. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్‌రావ్‌ను దూషించినట్టు వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ గలాట ఢిల్లీ కేంద్రంగా జరగడం విశేషం. ఢిల్లీలోని షాంగ్రీల హోటల్ వేదికగా ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల ఎదుట దూషణలపర్వం కొనసాగడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో ఇండియా బ్లాక్ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీల మైదానంలో సభ నిర్వహించిన విషయం విదితమే.
ర్యాలీ, సభకు హాజరయ్యేందుకు రాష్ట్రం నుంచి వెళ్లిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు అక్కడ షాంగ్రీల హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం సభకు వెళ్లేందుకు సిద్ధమై హోటల్ లాబీలో అందరూ కలుసుకున్న సమయంలో.. ఎమ్మెల్యే తోట మంత్రిని గౌరవపూర్వకంగా పలకరించిన సమయంలోనే మంత్రి దూషణల పర్వం కొనసాగించినట్టు సమాచారం. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో డీసీసీల నియామకమై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ సమయంలోనే ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల సమక్షంలో మంత్రి అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు రూమ్‌లోకి తీసుకెళ్లి కొడతా అంటూ వార్నింగ్ ఇవ్వడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అనూహ్య పరిణామంతో ఎమ్మెల్యే తోట తీవ్ర దిగ్బ్రాంతికి గురై కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్‌కు సమాచారం ఇచ్చి టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్‌కు, ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం చోటు చేసుకోగా.. సోమవారం ఫిర్యాదు చేశారు.
నా ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారేమో..?
మంత్రి దామోదర రాజనర్సింహాతో ఎలాంటి సంబంధమూ లేదు. ఆయనది వేరే జిల్లా. నాది వేరే జిల్లా. మా జిల్లా ఇన్‌చార్జీ మంత్రి కూడా కాదు. కానీ ఇలా ఎందుకు దూషించారో తెలియదు. సభకు వెళ్లేందుకు సిద్ధమై మంత్రి కనిపిస్తే పలకరించగా అందరి ముందే దూషించారు. గతంలో ఎప్పుడు ఈ విషయమై చర్చ కూడా జరిగింది లేదు. ఏఐసీసీలో నా ఇన్‌ప్ల్యూయెన్స్ పెరుగుతుందని, నాకు ఇష్టం వచ్చిన వారికే ఇప్పిస్తున్నా అని తిట్టారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాజకీయాలలోకి రావడంతో నా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారేమో.? ఈ విషయమై టీపీసీసీ అధ్యక్షులతో పాటు ఏఐసీసీకి ఫిర్యాదు చేశా.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్‌రావు







కామెంట్‌లు (0)