Magazines

రిటైలర్లకే నేరుగా బియ్యం సరఫరా

16 నిమిషాల క్రితం

Direct supply of rice to retailers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 2 నిమిషాల చదవడం

బియ్యం లభ్యతపై వ్యాపారులకు ఆందోళన వద్దు..

ముందస్తు నిల్వలు చేయొద్దు

హోల్‌సేలర్లు, దళారులపై ఆధారపడాల్సిన పనిలేదు

కేఎన్‌ఎం రకం రూ.62, జేఎస్‌ఆర్‌ రూ.74కే విక్రయం: ఇండెంట్లు ఇవ్వాలని రిటైలర్లకు చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ సూచన​
నవతెలంగాణ-సిటీబ్యూరో

మార్కెట్‌లో బియ్యం కొరత లేకుండా చూడటంతోపాటు సాధారణ ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన బియ్యం అందించేందుకు హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని రిటైల్ వ్యాపారులందరికీ రైస్ మిల్లర్ల ద్వారా నేరుగా బియ్యం సరఫరా చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. బియ్యం లభ్యత, సరఫరా విషయంలో రిటైల్ వర్తకులు ఎలాంటి ఆందోళనకూ గురికావాల్సిన అవసరం లేదని జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ (సీఆర్వో) జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు.

​మిల్లర్లు సరఫరా చేసే నిర్ణయించిన ధరలివే(కిలోకు):

​రిటైల్ వ్యాపారులకు నేరుగా సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు సంసిద్ధత వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. కేఎన్‌ఎం బియ్యం కిలో రూ.62, జేఎస్‌ఆర్ బియ్యం కిలో రూ.74కు ఇవ్వనున్నారు. ఈ ఏర్పాట్ల వల్ల రిటైల్ వ్యాపారులు ఇకపై హోల్‌సేల్ వర్తకులు, బ్రోకర్లు లేదా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని పౌరసరఫరాల శాఖ తేల్చిచెప్పింది. వ్యాపారులకు అవసరమైన పరిమాణంలో బియ్యాన్ని రైస్ మిల్లర్ల సమన్వయంతో నేరుగా దుకాణాలకే చేరవేస్తామని స్పష్టం చేసింది.

​ఇండెంట్లు సమర్పించాలి..

రైస్ మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేయాలనుకునే రిటైల్ వ్యాపారులు తమ షాపు పేరు, పూర్తి చిరునామా, జీఎస్టీ నెంబర్, కావాల్సిన బియ్యం రకం(కేఎన్‌ఎం,జేఎస్‌ఆర్‌), అవసరమైన పరిమాణం, ఫోన్ నంబర్ తదితర వివరాలను జిల్లా పౌరసరఫరాల అధికారులకు సమర్పించాలని సూచించారు. వ్యాపారుల నుంచి ఇండెంట్లను స్వీకరించి, రైస్ మిల్లుల నుంచి నేరుగా రిటైల్ కౌంటర్లకు బియ్యం సరఫరా జరిగేలా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుందన్నారు. రిటైల్ వ్యాపారులు మార్కెట్ పుకార్లను నమ్మి భయపడాల్సిన పనిలేదని, అనవసరంగా బియ్యాన్ని ముందస్తుగా ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకోకూడదని పౌరసరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది. వినియోగదారులకు నిరంతరాయంగా, ఎలాంటి ఇబ్బందీ లేకుండా సరసమైన ధరలకే బియ్యం అందుబాటులో ఉండేలా పౌరసరఫరాల శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్