Magazines

బ్యాంకర్లకు సర్కారు బాకీ రూ.725 కోట్లు

21 నిమిషాల క్రితం

రాష్ర్ట ప్రభుత్వం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 2 నిమిషాల చదవడం

దీర్ఘకాలంగా పెండింగ్‌..

ప్రతి ఎస్‌ఎల్‌‌బీసీ మీటింగ్‌‌లో ప్రత్యేక ఎజెండా

రాష్ర్ట ఆర్థికమంత్రి అధ్యక్షత వహించినా పరిష్కారం శూన్యం

రైతుబంధు చెక్కుల ముద్రణ చార్జీలు చెల్లించని వైనం

స్వయంగా ఆర్థికమంత్రి అధ్యక్షత... ప్రతి మూడునెలలకు సమావేశాలు...సుదీర్ఘకాలంగా ఒకే అంశం ఎజెండాలో కొన‘సాగుతూనే’ ఉంది. ఎప్పటికప్పుడు మళ్లీ చూద్దాం 
అని వాయిదా వేయడం ఆనవాయితీగా మారింది. అందరికీ అప్పులిచ్చే బ్యాంకర్లు సర్కారు నుంచి బకాయిలు మాత్రం వసూలు చేసుకోలేకపోతున్నారు. 12 ఏండ్లుగా ఇదే తంతు నడుస్తోంది.

ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

రాష్ర్ట ప్రభుత్వం బ్యాంకర్లకు 2014 నుంచి 2018 మధ్య కాలానికి సంబంధించి రూ.725.18 కోట్లు బకాయి పడింది. అప్పటి నుంచి ప్రతి మూడునెలలకోసారి జరిగే రాష్ర్టస్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌‌బీసీ) ఎజెండాలో ఈ అంశం ప్రత్యేకంగా చేరుస్తూనే ఉన్నారు. ఈ సమావేశాలకు స్వయంగా రాష్ర్ట ఆర్థికమంత్రి అధ్యక్షత వహిస్తుండటం విశేషం. అయినా 12 ఏండ్లుగా ఈ సొమ్ములో ఒక్క రూపాయి కూడా బ్యాంకర్లకు చేరలేదు. ప్రతి సమావేశంలోనూ ‘మళ్లీ చూద్దాం’ అనడం షరా మామూలుగా మారిపోయింది. ఏటా బ్యాంకర్ల మొండిబకాయిల ఖాతాల్లో రాష్ర్ట ప్రభుత్వం పేరు కూడా ఉండటం గమనార్హం! గత ప్రభుత్వం చేసిన అప్పులు, రుణాలను ప్రజాప్రభుత్వం చెల్లిస్తుందని 2024 సెప్టెంబర్‌ 18న తెలంగాణ ఎంఎస్‌ఎమ్‌ఈ - 2024 పాలసీ ఆవిష్కరణ సందర్భంగా స్వయంగా సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎస్‌ఎల్‌‌బీసీ సమావేశాల్లో సర్కారు ఇవ్వాల్సిన రూ.725.18 కోట్ల బకాయి అలాగే ఉంది. అప్పటి రాష్ర్ట ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, పావలావడ్డీ పంటరుణాలు ప్రకటించింది. ఆ రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చింది.

బ్యాంకర్లు రుణాలు ఇచ్చాక, ఆ వడ్డీని రాష్ర్ట ప్రభుత్వం రీయింబర్స్‌‌మెంట్‌ ‌చేయలేదు. దీనిపై ఏటా బ్యాంకు ఆడిటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ సొమ్ము కాకుండా 2018-19 రబీ సీజన్‌లో రైతుబంధు చెక్కులు ప్రింటింగ్‌ ‌ఖర్చు సొమ్ము రూ.25.94 కోట్లు కూడా ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించలేదు. ఈ సొమ్ములో అత్యధిక భాగం అప్పటి ఆంధ్రాబ్యాంకు (ఇప్పటి యూనియన్‌ ‌బ్యాంక్‌)‌కు రూ.7.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాత స్థానంలో స్టేట్‌‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌‌బీఐ) ఉంది. దీనికి 4.56 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మూడోస్థానంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఉంది. దీనికి రూ.3.74 కోట్లు చెల్లించాలి. మొత్తం పది బ్యాంకులకు కలిపి రూ.25.94 కోట్లు చెల్లించాల్సి ఉంది. రుణాలు, చెక్కుల ముద్రణ బకాయిలపై బ్యాంకర్లు ఆర్థికశాఖ, వ్యవసాయ శాఖకు పలుమార్లు లేఖలు రాసారు. అటునుంచి ఎలాంటి స్పందన లేదు. స్వయంగా ఆర్థికమంత్రి అధ్యక్షతన జరిగే ఎస్‌ఎల్‌‌బీసీ సమావేశాల అజెండాలో చేరిస్తేనన్నా సర్కారు కనికరిస్తుందేమో అని బ్యాంకర్లు ఆ పని కూడా చేస్తున్నారు. ఎజెండాలోని ఈ అంశం చర్చకు వచ్చిన ప్రతిసారీ ఆర్థికమంత్రి పట్టించుకోనట్టు ముఖం తిప్పుకోవడం కూడా ఆనవాయితీగా మారిందని బ్యాంకర్లు మొత్తుకుంటున్నారు. మంగళవారం మరోసారి ఎస్‌ఎల్‌‌బీసీ సమావేశం స్వయంగా ఆర్థికమంత్రి అధ్యక్షతన ఆయన నివాసమైన జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌‌లో జరగనుంది. దీనిలోనైనా సర్కారు బ్యాంకర్లను కనికరిస్తుందో లేదో చూడాలి!!


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్