25 కిలోల క్లోరల్ హైడ్రేట్ స్వాధీనం
ఐదుగురు అరెస్ట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కల్తీ కల్లు తయారీ, విక్రయాలు, నిషేధిత రసాయన పదార్థం క్లోరల్ హైడ్రేట్ అక్రమ సరఫరాపై ఎక్సైజ్ శాఖ కొరడా ఝళిపించింది. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు, దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా మల్కాజిగిరిలో ఎక్సైజ్, పోలీసు శాఖలు సంయుక్తంగా దాడులు చేపట్టాయి. ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లోని కల్లు దుకాణంలో తనిఖీలు నిర్వహించగా, కల్లులో క్లోరల్ హైడ్రేట్ కలిపినట్టు గుర్తించారు. పంచనామా చేసి, నమూనాలు సేకరించారు. 163 లీటర్ల కల్తీ కల్లును ధ్వంసం చేశారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అలాగే నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ కల్లు కాంపౌండ్‌లో కూడా తనిఖీలు చేపట్టారు. అక్కడ కూడా కల్లులో క్లోరల్ హైడ్రేట్ కలిపినట్లు గుర్తించి, పంచనామాచేసి, నమూనాలు సేకరించారు. 101 లీటర్ల కల్తీ కల్లును ధ్వంసం చేసి, ఇద్దర్ని అరెస్టు చేశారు. ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. కల్తీ కల్లులో ఉపయోగిస్తున్న క్లోరల్ హైడ్రేట్ సరఫరా మూలాలను గుర్తించే దర్యాప్తులో భాగంగా, సరఫరాదారుడైన సిద్ధగోని రంగయ్యను యాదాద్రి భువనగిరి జిల్లాలోని పిలాయిపల్లి గ్రామంలో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 25 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రసాయనం సరఫరా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, నెట్‌వర్క్, సరఫరా మార్గాలపై దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
క్లోరల్ హైడ్రేట్ వంటి నిషేధిత రసాయన పదార్థాలను కల్లులో కలపడం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరమనీ, ఇలాంటి కల్తీ కల్లును సేవించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఎక్సైజ్ శాఖ ఏమాత్రం సహించదని తెలిపారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే సమీప ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.






కామెంట్‌లు (0)