ఏడుగురు విద్యార్థులకు అస్వస్థత
తక్షణం స్పందించిన వైద్యాధికారులు
చికిత్స అనంతరం అపాయం లేదన్న డాక్టర్లు
వతెలంగాణ-జోగిపేట
సంగారెడ్డి జిల్లా
జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్లో బుధవారం ఉదయం ఫుడ్ పాయిజన్ జరిగి ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు, అధికారులు, విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు చెందిన సుమారు 90 మంది విద్యార్థులు ఎస్సీ హాస్టల్ లో ఉంటూ విద్య అభ్యసిస్తున్నారు. బుధవారం ఉదయం హాస్టల్ లో పులిహోర తిని విద్యార్థినీలు కళాశాలకు వెళ్లారు. కొద్దిసేపటి తరువాత వారిలో కొంతమందికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి రావడంతో భయాందోళనకు గురయ్యారు. స్వప్న, శశికళ, నవిత, శైలజ, జ్ఞానేశ్వరి, దీపిక, గంగోత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తోటి విద్యార్థులు వారిని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ సౌజన్య ఆధ్వర్యంలో డాక్టర్లు వారిని పరీక్షించి చికిత్స అందించారు. విద్యార్థుల ఆరోగ్యం కుదుటపడిందని ఆమె స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న జోగిపేట ఆర్డీవో రమేష్ బాబు, తహసీల్దార్ మధుకర్ రెడ్డి, ఎస్ఐ గిరి శ్రీకాంత్ హాస్టల్‌కి వెళ్లి వార్డెన్ సబితను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వెంటనే కిచెన్ గదిని, వడ్డించిన పులిహోరను పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని, అపాయం ఏమీ లేదని డాక్టర్లు ఆయనకు తెలిపారు.
ఫుడ్ పాయిజన్‌కు సంబంధించి విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విషయం తెలుసుకున్న టీఎస్‌టీపీసీ మాజీ చైర్మెన్ మఠం బిక్షపతి, జిల్లా మాజీ జెడ్పీ విప్ పి. నారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్.. ఆస్పత్రికి వెళ్లి విద్యార్థిలను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






కామెంట్లు (0)