వారిని బీజేపీ బానిసలుగా చూస్తే..మేం భాగస్వాములుగా చూస్తున్నాం
రూ.5 లక్షల ప్రమాద బీమా..రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం
వైఫైతో కూడిన విశ్రాంతి గదులు...డేటా హక్కు
వారి సంక్షేమంపై గతంలో హామీనిచ్చాం..ఇప్పుడు అమలు చేస్తున్నాం
‘తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత :
సంక్షేమ పథకం’ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘గిగ్ వర్కర్లు ఈ దేశ పునాదులు. బీజేపీ వారిని బానిసలుగా చూస్తోంటే... కాంగ్రెస్ మాత్రం వారిని అభివృద్ధిలో భాగస్వాములుగా చూస్తోంది...’ అని లోక్‌సభ లో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యా నించారు. తమ పార్టీ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం వారి సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా.. రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పించనుందని తెలిపారు. వైఫైతో కూడిన విశ్రాంతి గదులను ఏర్పాటు చేయటంతోపాటు, తమ డేటాను తెలుసుకునే హక్కును వారికి కల్పించబోతోందని చెప్పారు. గతంలో తెలంగాణకు విచ్చేసిన సందర్భంగా గిగ్ వర్కర్ల సాధక బాధకాలను తాను స్వయంగా విన్నానని, వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీనిచ్చామని గుర్తు చేశారు. ఆ మేరకు ఇప్పుడు ఒక నూతన విధానంతో పలు చర్యలు తీసుకోబోతున్నామని ఆయన వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని శిల్పారామం జయభేరి గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ‘తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత- సంక్షేమ పథకాన్ని’ రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌తోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ... ‘21వ శతాబ్దం డేటా శతాబ్దం. ప్రపంచవ్యాప్తంగా దీనిపైనే చర్చ సాగుతోంది. పలు ప్రాంతాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తున్నారు. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఉబర్ వంటి కంపెనీలు డేటా ఆధారంగానే నడుస్తున్నాయి. కానీ భారత దేశంలో గిగ్ వర్కర్లకు వారి డేటా నేటికీ అందుబాటులో లేదు. ఆ వర్కర్ తన డేటాను తానే చూసుకోలేడు. వారు ఏం పని చేశారు, ఎన్ని డెలివరీలు చేశారు, ఎంత సమయం పట్టింది, ఎంత డబ్బు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఈ సమాచారం వారికి అందటం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన చట్టం డేటాపై వారికి హక్కును కల్పించబోతోంది. వారు చేసే పని, పూర్తి చేసే రైడ్లు, డెలివరీలు, ప్రతి రైడ్ లేదా లావాదేవీకి ఎంత డబ్బు చెల్లిస్తున్నారనే పూర్తి సమాచారం వారి చేతిలో ఉంటుంది. ప్రభుత్వం గిగ్ వర్కర్లకు గ్యారెంటీ ఇస్తోంది. ఈ సమాచారం వారి మొబైల్ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. దాన్ని వారు చూసుకోవచ్చు...’ అని చెప్పారు.
నగరాల్లో గిగ్ వర్కర్లు రోజంతా ఎండలో స్కూటర్ నడుపుతూ డెలివరీలు చేస్తారని రాహుల్ గాంధీ అన్నారు. కానీ..వారు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకమైన స్థలాలేవీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం వై-ఫై సౌకర్యంతో కూడిన విశ్రాంతి కేంద్రాలు (రెస్ట్ జోన్లు) నిర్మిస్తోందని చెప్పారు. అక్కడ వారు విశ్రాంతి తీసుకోవచ్చన్నారు. వారి వాహనాన్ని నిలుపుకోవచ్చనీ, కాసేపు కూర్చోవచ్చనీ, అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి రెస్ట్ జోన్లను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాల్లో నిర్మించబోతోందని చెప్పారు. ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా, అనారోగ్యానికి గురైనా గిగ్ వర్కర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. పని చేయలేని పరిస్థితి ఏర్పడితే వారి కుటుంబం మొత్తం సంక్షోభానికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందించడానికి గ్యారెంటీనిస్తోందని చెప్పారు. గిగ్ వర్కర్లకూ పింఛన్లు రావాలనీ, వారికీ సామాజిక భద్రత ఉండాలనీ, వారి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా కావాలని చెప్పారు. అందుకే ప్రతి లావాదేవీలో, వారు డెలివరీ చేసిన ప్రతీసారి... ఉబర్ రైడ్ పూర్తి చేసినా, బ్లింకిట్ డెలివరీ అయినా లేదా మరే ఇతర సేవ అయినా, ప్రతి లావాదేవీ, ప్రతి డెలివరీపై ఒక శాతం మొత్తం నేరుగా వారి భవిష్యత్తు, భద్రతకు జమ అవుతుందని భరోసానిచ్చారు. కంపెనీలు ప్రతీ లావాదేవీపై ఈ మొత్తాన్ని తెలంగాణ గిగ్ వర్కర్స్ బోర్డులో జమ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత బోర్డు ద్వారా ఈ డబ్బు నేరుగా గిగ్ వర్కర్ల బ్యాంక్ ఖాతాలకు చేరుతుందని ఆయన తెలిపారు.
రెండు రకాల భావజాలాలు...
21వ శతాబ్దంలో రెండు రకాల భావజాలాలు కొనసాగుతున్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇందులో ఒకటి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అని, ఆ సంస్థలు గిగ్ వర్కర్లను వెట్టి చాకిరీ చేసే కూలీలుగా మార్చాలని కోరుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ గిగ్ వర్కర్లు 24 గంటలు పని చేయాలి, రక్తం, చెమట చిందించాలి, ప్రమాదాల్లో గాయపడాలి, దెబ్బలు తినాలి, చనిపోవాలి’ అని ఇవి కోరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పూర్తి లాభం మాత్రం బిలియనీర్లకు, అంబానీ-అదానీలకు, ఉబర్-ఓలాలకు దక్కాలన్నదే మోడీ సర్కార్ ఉద్దేశమని విమర్శించారు. గిగ్ వర్కర్ల కష్టానికి తగిన ఫలితం, ప్రయోజనం వారికి దక్కకూడదన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని దుయ్యబట్టారు. ఆ భావజాలానికి భిన్నంగా రెండో భావజాలం కాంగ్రెస్‌దని చెప్పారు. ‘నా భావజాలం ప్రకారం గిగ్ వర్కర్లు ఈ దేశానికి పునాదులు. కార్మికులు ఈ దేశానికి పునాది, ఆధారం. ఇది ఒక భాగస్వామ్యం. గిగ్ వర్కర్లను దేశాభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలని, వారిని రక్షించాలని మేం కోరుకుంటున్నాం. వారికి భద్రత, రక్షణ కల్పించాలని మేం భావిస్తున్నాం...’ అని తెలిపారు. గిగ్ వర్కర్లు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మొత్తం వారికి అండగా నిలబడతాయని హామీనిచ్చారు.
భారీ బైక్ ర్యాలీ-పాల్గొన్న రాహుల్ గాంధీ, సీఎం
అంతకుముందు శిల్పకళా వేదిక నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లు భారీ బైక్ ర్యాలీ నిర్వ హించారు. ఈ ప్రదర్శనలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొ న్నారు. ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.






కామెంట్‌లు (0)