Magazines

విమర్శలంటే మోడీ సర్కారుకు వణుకెందుకు?

26 నిమిషాల క్రితం

Why does the Modi government tremble at criticism?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 3 నిమిషాల చదవడం

భారత్‌ సమ్మిట్‌కు 115 మంది విదేశీ వక్తలకు నిరాకరణ
తొలుత అనుమతించి చివరి నిమిషంలో వీసాల రద్దు

సార్వభౌమాధికారమనే ముసుగులో కేంద్రం దాటవేత

ఎన్‌డీఏ ప్రభుత్వ తీరుపై అనేక అనుమానాలు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని గొప్పలు చెప్పుకునే మోడీ ప్రభుత్వం.. విమర్శలను మాత్రం సహించలేకపోతోందా? తమ విధానాలపై ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందా? కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ ప్రతినిధుల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరు ఈ ప్రశ్నలకు తావిస్తోంది. తొలుత అనుమతులు ఇచ్చి, వీసాలు మంజూరు చేసిన 115 మంది విదేశీ వక్తలకు చివరి నిమిషంలో ప్రవేశం నిరాకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణాలు వెల్లడించకుండా సార్వభౌమాధికారమనే మాటతో విదేశాంగ శాఖ తప్పించుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.


న్యూఢిల్లీ : ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకల పట్ల కేంద్రంలోని మోడీ సర్కారు వైఖరి మరోసారి చర్చనీయాం శమైంది. కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు విదేశాల నుంచి రావాల్సిన 115 మంది వక్తలకు కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో ప్రవేశం నిరాకరించింది. తొలుత విదేశాంగ శాఖ అనుమతులు ఇచ్చి, వీసాలు మంజూరు చేసిన తర్వాత వాటిని రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతర్జాతీయ వేదికపై ప్రజాస్వా మ్యం, భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడే బీజేపీ, ఆ పార్టీ నాయకులు.. ఆచరణలో మాత్రం భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న భారత్‌ సమ్మిట్‌కు మొత్తం 315 మంది విదేశీ వక్తలకు విదేశాంగ శాఖ (ఎంఈఏ) తొలుత అనుమతులు ఇచ్చింది. అయితే వారిలో 115 మందికి భారత్‌లో ప్రవేశం నిరాకరించారనీ, మరికొందరి వీసాలు రద్దు చేశారని కాంగ్రెస్‌ ఎంపీ, విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మెన్‌ శశిథరూర్‌ వెల్లడించారు. కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఏ) ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

విదేశాంగ శాఖ వద్ద స్పష్టమైన సమాధానం కరువు

ఈ వ్యవహారంపై విదేశాంగ శాఖను విలేకరులు ప్రశ్నించగా.. స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సార్వభౌమాధికారమనే మాటను ముందుకు తెచ్చింది. శుక్రవారం మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పందిస్తూ.. వీసా వ్యవహారాలు ఏ దేశానికైనా, ఏ ప్రభుత్వానికైనా సార్వభౌమాధికార పరిధిలోని అంశాలని వివరించారు. అయితే, తొలుత అనుమతులు ఇచ్చి, వీసాలు మంజూరు చేసిన తర్వాత వాటిని ఎందుకు రద్దు చేశారో మాత్రం చెప్పలేదు. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుందా? ఏ కారణాలతో విదేశీ ప్రతినిధులను అడ్డుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడం గమనార్హం.

విమర్శనాత్మక స్వరాలపై ఉక్కుపాదం

ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలపై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. భారత్‌ సమ్మిట్‌కు హాజరయ్యే విదేశీ ప్రతినిధుల జాబితాను పరిశీలించి అనుమతులు ఇచ్చిన తర్వాత, చివరి నిమిషంలో వాటిని రద్దు చేయడం వెనుక కారణాలేమిటన్నది ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వీసా రద్దుకు గురైన వారిలో నార్వేకు చెందిన పాత్రికేయురాలు హెల్లె లింగ్‌ కూడా ఉన్నారు. మేలో నార్వే పర్యటన సందర్భంగా ప్రధాని మోడీని ఆమె అడిగిన ప్రశ్న అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన మీడియా నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇస్తారా? అని ఆమె మోడీని ప్రశ్నించారు. భారత్‌ సదస్సుకు హాజరయ్యేందుకు సిద్ధమైన ఆమెకు తొలుత వీసా మంజూరైంది. అయితే ప్రయాణానికి కొన్ని గంటల ముందు వీసా రద్దు చేసినట్టు సమాచారం. ఈ పరిణామం విమర్శకులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.

వీసా రద్దు వెనుక గల నిబంధనలేమిటో..!

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యే విదేశీయుల వీసా దరఖాస్తులను కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే విదేశాంగ శాఖ లేదా హోంశాఖ పరిశీలనకు పంపాల్సి ఉంటుంది. అయినప్పటికీ, ఇప్పటికే అనుమతులు పొందిన వారి వీసాలను ఏ నిబంధ నల ప్రకారం రద్దు చేశారో కేంద్రం వెల్లడిం చకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ప్రజాస్వామ్యానికి ఇదేనా గౌరవం?

ఈ పరిణామంపై శశిథరూర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత 315 మంది వక్తల్లో 115 మందికి ప్రవేశం నిరాకరించారని తెలుసుకోవడం నిరాశ కలిగించిందన్నారు. ఏ చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో పూర్తిగా స్పష్టత లేదని తెలిపారు. సదస్సు శనివారంతో ముగియనున్న నేపథ్యంలో చివరి నిమిషంలో తీసుకున్న ఈ చర్యల వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని విమర్శించారు. “విమర్శిస్తారనే భయంతో గొంతుకలను అణచివేయాల్సినంత అభద్రతాభావంలో ఒక గర్వించదగిన ప్రజాస్వామ్యం ఉండటం ఎంతటి అవమానం” అని థరూర్‌ వ్యాఖ్యానించారు.

మోడీ సర్కారు తీరు సరికాదు : మేధావులు

ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు, విమర్శలకు స్థానం ఉండాలి. కానీ విమర్శించే అవకాశం ఉన్నవారిని అంతర్జాతీయ సదస్సులకు రాకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు మోడీ ప్రభుత్వ ప్రజాస్వామ్య నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అనుమతులు ఇచ్చిన తర్వాత వీసాలు రద్దు చేయడానికి గల కారణాలను వెల్లడిం చకుండా సార్వభౌమాధికారమనే సమాధానంతో సరిపెట్టడం కేంద్ర ప్రభుత్వ పారదర్శకతపైనా సందేహాలు కలిగిస్తోందని మేధావులు అంటున్నారు. ఈ విషయంలో మోడీ సర్కారు తీరు సరిగ్గా లేదని వారు విమర్శిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్