గోరేటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, బొగ్గారపు
దయానంద్లకు సన్మానం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ముగ్గురు శాసనమండలి సభ్యుల పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో శనివారం అసెంబ్లీ కౌన్సిల్ హాల్ లో శాసన మండలి సభ్యులు గోరేటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, బొగ్గారపు దయానంద్ ను తెలంగాణ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాశ్ , చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముగ్గురు సభ్యుల సేవలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. ఇది వీడ్కోలు చెప్పే సమావేశం కాదనీ, జ్ఞాపకాల సమావేశమని అభిప్రాయపడ్డారు. పదవి అనేది శాశ్వతం కాదనీ, కానీ సేవ అనేది మాత్రం శాశ్వతమని అన్నారు. వీరి పదవీకాలం ముగిసినా చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని చెప్పారు. ఈకాలంలో వారు మాట్లాడిన ప్రతి మాట ప్రజల గొంతుకగా మారిందని అభిప్రాయపడ్డారు. లేవనెత్తిన ప్రతి అంశం ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం కలిగించిందని గుర్తుచేశారు. తెలంగాణ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ శాసన మండలిలో ప్రజా సమస్యలపై తమ గళం వినిపించి, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా రాణించిన ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, దయానంద్ లకు అభినందనలు తెలిపారు. వీరు ముగ్గురు కేవలం ఎమ్మెల్సీలుగా మాత్రమే రిటైర్ అయ్యారనీ, ప్రజా సేవ కార్యక్రమాల్లో కాదన్నారు. ప్రభుత్వ చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గోరేటి వెంకన్న, దయానంద్, బస్వరాజ్ సారయ్య శాసన మండలిలో ఎంతో గౌరవంగా, హుందాగా వ్యవహరించారని అన్నారు. ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు చేశారనీ, భావి తరాల సభ్యులకు మార్గదర్శకులుగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీలు వాణీ దేవి కోటిరెడ్డి, అంజిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఏవియన్ రెడ్డి, భాను ప్రసాద్ రావు, శాసనమండలి కార్యదర్శి నరసింహాచార్యులు, శాసన సభ కార్యదర్శి తిరుపతి, శాసన సభ, శాసన మండలి సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)