Magazines

పి. లీల పాట కోసం గూడు విడిచిన కోయిల

15 నిమిషాల క్రితం

Leela’s song
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 6 నిమిషాల చదవడం

‘సినిమా పాటలు, కచేరిలే ముఖ్యమనుకుంటే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. నేను భర్తగా కావాలంటే ఈ కచేరీలు పాటల రికార్డింగ్లు వదిలేయాలి’ అని ఆయన కరాఖండిగా చెబుతున్నాడు. దానికి సమానంగా, సౌమ్యంగా ఆ అమ్మాయి ‘నేను ఈ కచేరీలలో పాడుతానని ఒప్పుకున్నాను చివరి క్షణంలో పాడను అంటే సరికాదు. నేను కచేరిలో పాడి తీరాల్సిందే’. ‘నువ్వేదో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయిని పెండ్లి చేసుకున్నాను, ఇలా పాటలు, కచేరీలు అంటూ వీధుల వెంబడి తిరిగితే మా కుటుంబంలో ఒప్పుకోరు. ఇక్కడ అంతా నేను చెప్పినట్టే నడుచుకోవాలి. కుదరదంటూ’ చెప్పేశాడు భర్త.


‘అదేమిటి నేను పెండ్లికి ముందే కచేరీలు చేస్తాను. సినిమాలో పాటలు పాడుతానని చెప్పాను. అది తెలిసే పెండ్లికి ఒప్పుకున్నారు, ఇప్పుడు కాదంటే ఎలా? నేను పాడుతాను. అన్నీ తెలిసే చేసుకుని.. ఇప్పుడు మానెయ్యమంటే ఏమిటర్ధం.!?’ అంది ఆ అమ్మాయి. ‘అయితే నీకు పాటలు, కచేరీలే ముఖ్యమైతే ఈ ఇల్లు నా పేరు మీద రాసివ్వు. నీ బ్యాంకు అకౌంట్ కూడా నా పేరున మార్చు. నువ్వు సంపాదించే సొమ్మంతా నా చేతిలో పెట్టాలి. ఆ తర్వాత నువ్వు ఎక్కడైనా తిరుగు నాకేమీ అభ్యంతరం లేదు’ అంటూ తన అసలు రంగును బయటపెట్టాడు ఆ లాయర్ భర్త. ‘ఎన్ని చెప్పినా నేను పాడటం మానుకోను’ ఆమె తెగేసి చెప్పింది. కోపంతో అతను ‘నా సంగతి తెలుసుగా. నాది లాయర్ బుద్ది అని మర్చిపోకు. రేపు తెల్లారేసరికి విడాకులు సిద్దం చేస్తా’ అంటూ బెదిరించాడు.

‘సరే రేపటి దాకా అక్కరలేదు. ఈరోజే రెడీ చెయ్. అంతెందుకు ఇదిగో తెల్లకాగితం. సంతకం చేసి ఇస్తాను విడాకులకైతే. పెండ్లి చేసుకుంది మొదలు నేను సుఖపడి బావుకున్నదేమీ లేదు. ఈ కట్టు బానిసత్వం నాకక్కరలేదు. ఎవరి దారి వారు చూసుకుందాం. ఇక కలిసి ఉండలేం’ అంటూ తెగదెంపులకు సిద్ధపడింది. ‘నువ్వు తెగిస్తావని నాకు తెలుసు. అందుకే ఎప్పుడో సిద్ధం చేశాను’ అంటూ విడాకుల కాగితాలు ముందు ఉంచాడు. సంతకం చేసి ఏడాది కూడా దాటని తన పెండ్లికి విడాకులతో వీడ్కోలు పలికింది. ఆమె ఎవరో కాదు. ప్రఖ్యాత దక్షిణ భారత సినీ నేపథ్య గాయని పి. లీల. నేటి తరం సినీ సంగీత అభిమానులకు పి.లీల పేరు తెలియకపోవచ్చు. 1950,60 దశకాల్లో తమిళ, తెలుగు సినీ సంగీత రంగంలో ఆమె ఒక మకుటం లేని రాణిగా వెలుగొందింది. మలయాళం, కన్నడ భాషలతో పాటు బెంగాలీ, సింహళ భాషల్లో కూడా సుమారు 5,000 సినీ గీతాలు పాడింది.

ఇందులో తమిళ పాటలే సుమారు 1000 వుంటాయి. పోరాయతు(పి.) లీల 1934 మే 19న కేరళలోని పాలక్కాడ్ సమీపంలో ఉన్న చిత్తూరులో పుట్టింది. తండ్రి ఎం.ఎం.కుంజు మీనన్ కొచ్చిన్‌లో ఉపాధ్యాయుడు. 4వ తరగతిలోనే చదువు ఆపేసిన నాయర్‌ల అమ్మాయి. సంగీతంపై ఆమెకున్న ఆసక్తినీ గమనించి తండ్రి ఒక సంగీత విద్వాంసురాలిగా తీర్చిదిద్దడానికి పూనుకున్నాడు. లీల పదవ ఏట రేడియోలో పాడింది. మీనన్ ఉద్యోగానికి రాజీనామా చేసి లీల సంగీత ప్రస్థానం కోసం తన కుటుంబంతో మద్రాసుకు మారారు. తండ్రి లీలకు రామ భాగవతార్ వద్ద సంగీత శిక్షణ ఇప్పించాడు. లీల, ఆమె తండ్రి మద్రాసులో ఒక్క సంగీత కచేరీని కూడా వదిలిపెట్టలేదు. దిగ్గజాల సంగీతాన్ని వింటూ ఆమె ఆ కళలోని మెళకువలను నేర్చుకుంది. అనేక సంగీత పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. సహజంగానే ఆమె ప్రతిభ ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి సినీ సంగీత దర్శకుల దృష్టిని ఆకర్షించింది.

సినీ సంగీత, నృత్య విమర్శకులు వి.ఎ.కె. రంగారావు మాటల్లో చెప్పాలంటే ‘ఘంటసాల ఎన్నో ఏండ్ల పాటు పి. లీల పట్ల ప్రత్యేక అభిమానాన్ని (అనురాగాన్ని) కలిగి ఉండేవారు’. 1944లో మద్రాసు విశ్వసభ వారి ‘రాగం-తాళం-పల్లవి’ పోటీలో లీల ప్రథమ స్థానం సాధించింది. ఆ పోటీకి జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం, పాల్ఘాట్ మణి అయ్యర్ న్యాయనిర్ణేతలు. దాంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. అప్పుడప్పుడే సినిమాల్లో ప్లేబ్యాక్ మొదలైన సమయంలో పద్మనాభ శాస్త్రి లీలకు తొలి అవకాశం ఇచ్చాడు. 1948లో లీల ‘కంకణం’ చిత్రం కోసం తొలిసారిగా పాడింది. ఆ సినిమాలో ఆమె నాలుగు పాటలు పాడింది. ఆ తర్వాత ఆమె వెను తిరిగి చూడలేదు. మొదట్లో సింహళ సినీ రంగంలో భారతీయ కళాకారులు, సాంకేతిక నిపుణులే కీలకంగా పనిచేసేవారు. పలు సింహళ చిత్రాలు మనదేశంలోనే తయారైనవి. వి. దక్షిణామూర్తి, ఎస్.ఎమ్. సుబ్బయ్య నాయుడు వంటి భారతీయ సంగీత దర్శకులు వాటికి సంగీతం చేశారు.

జమున రాణి, కె.రాణి, ఎ.ఎమ్. రాజా, పి.లీల వంటి గాయనీగాయకులు ఆ రోజుల్లో సింహళ చిత్రాల కోసం పాడేవారు. 1949 లీల సినీ ప్రస్థానంలో ఒక కీలక మలుపు. ఆ ఏడాది ఆమె మూడు చిత్రాలలో పాడింది. తెలుగులో ‘మన దేశం’తో అడుగుపెట్టింది. ఆ తర్వాత మీర్జాపురం రాజా ‘కీలుగుర్రం’లో పాడింది. ఆపై ఆమెకు ఎంతో పేరు తెచ్చిన చిత్రం ‘గుణసుందరి కథ’. ఈ చిత్రంలో కథానాయిక శ్రీరంజని జూనియర్ కోసం లీల అన్ని పాటలు పాడింది. ఈ చిత్రానికి తమిళ రీమేక్ 1955లో తీసినప్పుడు సావిత్రికి అన్ని పాటలు లీలనే పాడింది. అంతకుముందు విజయవారి పాతాళభైరవి, పెండ్లి చేసి చూడు, మిస్సమ్మ, మాయాబజార్ చిత్రాలకు లీలనే పాడింది. ఆ తర్వాత శ్రీ లక్ష్మమ్మ కథ. ఇక ఆమెకు తిరుగులేదు. ఆ వెంటనే ఆమె ‘చంద్రహారం’, ‘ఆశైమగన్’, ‘మనం పోల మాంగళ్యం’ ‘అవ్వయార్’, ‘పెంపుడుకొడుకు’, ‘పెద్దమనుషులు’, ‘మేలుకొలుపు మేనరికం’. ‘సౌభాగ్యలక్ష్మి’(కన్నడం) చిత్రాలలో పాడింది. లీల సి.ఆర్. సుబ్బరామన్ వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నది.

ఆయన లీలకు చాలా అవకాశాలిచ్చాడు. 1949లో కన్నడ ‘భక్త కబీర్’లో లీల మొదట సి.ఆర్.ఎస్. కోసం పాడింది. ఆయన లీలను తమిళ చిత్రాలు ‘మోహిని’, ‘వేలైక్కారి’లలో కూడా పాడించాడు. 1950వ దశకంలో లీల అన్ని దక్షిణ భారత చిత్రాలలో పాడింది. ‘మనమగళ్’ చిత్రంలో తిరువాంకూర్ సిస్టర్స్ లలిత, పద్మినిల నృత్యానికి ఎం.ఎల్. వసంతకుమారితో కలిసి లీల ‘ఎల్లం ఇన్బ మయం’ అనే పాట పాడి మెప్పించింది. తెరపై లలిత, పద్మిని నృత్యం చేస్తుండగా తెర వెనుక ఎం.ఎల్.వి., లీల అలవోకగా ఒక రాగం నుండి మరో రాగానికి మారుతూ రాగమాలికను ఎం.ఎల్.వి.కి ధీటుగా పాడింది. ఆ తరంలో కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన ఇద్దరు నేపథ్య గాయనులు ఎం.ఎల్.వి., లీల మాత్రమే. దక్షిణాదిలో ఆమె ఎంత పేరు తెచ్చుకున్నదంటే చాలా ప్రకటనల్లో మొదట లీల పాడిన ‘ఎంగుమే ఆనందం’, ‘కొంచు సలంగై ఒలి కెట్ట’ వంటి ప్రసిద్ధ పాటల నుండి ఒక పంక్తి వినిపించేది. తెలుగు, తమిళ సినిమాల్లో మంచి గాయక జంటగా లీల, ఘంటసాల పేరు పొందారు. లీల మలయాళి. ఘంటసాల తెలుగువాడు. అయినప్పటికీ అప్పట్లో తమిళ చిత్రాల్లో వీరిది అత్యంత ప్రజాదరణ పొందిన జంట.

‘పాతాళ భైరవి’, ‘మాయాబజార్’, ‘ప్రేమ పాశం’ వంటి చిత్రాల్లో వీరిద్దరి కలయిక అద్భుతం. మహదేవన్, ఎస్. ఎం. సుబ్బయ్య నాయుడు, రాజేశ్వర రావు, సి. రామచంద్ర, విశ్వనాథన్-రామమూర్తి, జి. రామనాథన్ వంటి ప్రతి సంగీత దర్శకుడు ఆమెతో పాడించారు. తమిళ చిత్రాలలో ఆమె పాడిన నాలుగు అత్యుత్తమ సోలో గీతాలు ‘మిస్సియమ్మ,’ ‘వంచికొట్టై వాలిబన్’, ‘తంగప్పతుమై’ చిత్రాలలో ఉన్నాయి. ‘తంగప్పతుమై’ చిత్రంలో పద్మినికోసం విశ్వనాథన్-రామమూర్తి సంగీతంలో విషాద గీతం ‘సొల్లమ్మ వై తిరంతూ’ పాడింది. తాను పాడిన తమిళ పాటలలో ఇదే అత్యంత కష్టమైనదని లీల స్వయంగా చెప్పింది. ఈ పాట రికార్డింగ్ ఏకధాటిగా 12 గంటల పాటు జరిగింది. విషాదభరిత గీతం పాడుతూ లీల తీవ్రమైన భావోద్వేగానికి గురైంది. విశ్వనాథన్ సంతృప్తి చెందక లీలతో పలుమార్లు రీటెక్ చేయించి రికార్డు చేయించాడు. లీల పాడిన తమిళ హిట్ పాటల జాబితా చాలా పెద్దది.

జెమినీ వారి ‘వంజికోట్టై వాలిబన్’ చిత్రంలో ఆమె పాడిన ఒక నృత్య యుగళగీతం ఎంతో ఆదరణ పొందింది. ఈ పాటకు హిందీ చిత్ర సంగీత దిగ్గజం చితల్కర్ రామచంద్ర సంగీతం చేశాడు. బొంబాయిలో రికార్డింగ్ జరిగినప్పుడు మొదట కంగారు పడినా రామచంద్ర గారు ఆమె చేత ఆ పాటను అద్భుతంగా పాడించాడు. వైజయంతిమాల, పద్మిని నర్తించిన ఈ పాటను వాసన్ గారు అద్భుతంగా చిత్రీకరించాడు. ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక గొప్ప నృత్య సన్నివేశంగా నిలిచిపోయింది. 1958లో వచ్చిన ‘ఉత్తమ పుతిరన్’ చిత్రంలో ‘పుల్లి వైక్కిరాన్ పోడియ సోక్కురాన్’ అనే వేగవంతమైన జానపద గీతాన్ని కర్ణాటక సంగీత నేపథ్యం ఉన్న లీల పాడగలదా అనుకున్నాడు దర్శకుడు టి. ప్రకాశరావు. కానీ ఆమె పాడిన తీరు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. తెలుగు, తమిళ సినిమా రంగంలో కాలం గడుస్తున్న క్రమంలో ఘంటసాల, లీల, ఏ.ఎమ్. రాజా, జిక్కి, జయరామన్, ఎం.ఎల్. వసంతకుమారి, వంటి నేపథ్య గాయకుల ప్రాభవం తమిళ చిత్రసీమలో తగ్గుతూ వచ్చింది.

కారణం ఏమిటంటే గతంలో వివిధ రకాల గాయనీ గాయకులచే పాటలు పాడించే పద్ధతి పోయి ఒక చిత్రానికి కేవలం ఇద్దరు, ముగ్గురు గాయకులతోనే పాటలు పాడించే ధోరణి మొదలైంది. మరొకటి సినిమాల్లో పాటల సంఖ్య తగ్గడం కూడా. ఇంకా అప్పటి అగ్రశ్రేణి నటీనటులు తమ కోసం టి.ఎమ్. సౌందరరాజన్, ఘంటసాల, ఏ. ఎం. రాజా వంటి వారి సరసన పి.సుశీల మాత్రమే పాడాలని పట్టుబట్టడం. ఫలితంగా లీల వంటి గాయనులకు అవకాశాలు తగ్గినవి. అయితే అప్పట్లో ‘రేడియో సిలోన్’ లో ఆమె పాట ఎప్పుడూ అందుబాటులో ఉండేది. సుదీర్ఘ విరామం తర్వాత 1970లో ఎంగిరుందో వందాల్ తమిళ చిత్రంలో లీల ఒక పాట పాడింది. మళ్ళీ సుదీర్ఘ విరామం తర్వాత 1984లో ‘కర్పూర ముల్లై’ చిత్రంలో ఇళయరాజా సంగీతంలో ఆమె పాడింది. ఇది తెరపై శ్రీవిద్య అభినయించిన ఒక శాస్త్రీయ సంగీత గీతం. లీల తెలుగులో చివరగా వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రలోని ‘నీవెవరో..’

పాట పాడింది. తమిళ సినీ పరిశ్రమతో పాటు, తమిళనాడు సంగీత సంస్థలు కూడా లీలని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆమె అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే కేరళకు చెందిన రేడియో, టెలివిజన్ సంస్థలు ఆమెకు నిరంతరం గుర్తింపునిస్తూ గౌరవించాయి. ఆమె సినీ గీతాలతో పాటు, గురువాయూర్ అయ్యప్ప స్వామి, శ్రీకృష్ణునికి అంకితం చేసిన భక్తి గీతాలతో శ్రోతలను అలరించింది. లీలకు 1969లో కేరళ స్టేట్ అవార్డ్, 1992 లో తమిళనాడు కలైమామణి అవార్డ్ ఇవ్వగా, మరణానంతరం భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ ఇచ్చింది. ప్రాణ స్నేహితురాలైన ఎ.పి.కోమల, జమునా రాణిలతో కలిసి సింగపూర్, మలేషియా, శ్రీలంక, అమెరికాలలో కచేరీలు చేసిందామె. నేటికీ గురువాయూర్ ఆలయంలో లీల పాడిన ‘కృష్ణ... కృష్ణ...’ భక్తి గీతాలు వినిపిస్తుంటారు.

ఆమె పాడిన భక్తి గీతాలు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైనవి. లీల ‘చిన్నారి పాపలు’ తెలుగు చిత్రానికి సంగీతం చేసింది కూడా. 2005 అక్టోబర్ 31న లీల కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. జయలలిత తన సంతాప సందేశంలో లీలను ‘ఆమె తన మధురమైన స్వరంతో మలయాళం, తమిళం, తెలుగు భాషలలో చిత్ర పరిశ్రమకు, అలాగే కర్ణాటక సంగీతంలోనూ అద్భుతమైన పాటలు పాడి పేరు సంపాదించుకున్న భారతదేశపు గొప్ప గాయకులలో ఒకరు’ అని పేర్కొంది. లీల మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆమె పాడిన పాటలు మాత్రం నేటికీ మనకు వినిపిస్తూనే ఉన్నాయి.


హెచ్‌.రమేష్‌‌బాబు, 93916 34727

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్