Magazines

ప్రత్యామ్నాయ పంటల సాగుతో లాభాలు

19 నిమిషాల క్రితం

Cultivating Alternative Crops
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 5 నిమిషాల చదవడం

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
వాతావరణానికి అనుగుణంగా సాగులో మార్పులు

అగ్రి షో రైతులకు ఎంతో ప్రయోజనం : జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్యరెడ్డి, ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి

125 స్టాళ్లతో అగ్రి షో ప్రారంభం

తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడులే లక్ష్యంగా శాస్త్రీయ అవగాహన

డ్రోన్లు, సోలార్ మోటార్లు, డ్రిప్ ఇరిగేషన్, తేనెటీగల పెంపకంపై ప్రత్యేక ప్రదర్శనలు

నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎల్‌నినో ప్రభావా నికి అనుగుణంగా రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలని, ఆధునిక సాంకే తికతను అందిపుచ్చుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. సంప్రదాయ పంటలనే సాగు చేస్తే భవిష్యత్‌లో నీటి కొరతతోపాటు పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉంద న్నారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే పంటలను ఎంచుకుంటూ భూసారా న్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ​36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో మూడ్రోజులపాటు నిర్వహిస్తున్న వ్యవసాయ ప్రదర్శన (అగ్రిషో)ను శనివారం కలెక్టర్ బి.చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య రెడ్డి, ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, ఏఐకేఎస్ మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, అగ్రి షో కన్వీనర్ నంద్యాల నరసింహారెడ్డి తదితరులు ప్రారంభించారు. అనంతరం నంద్యాల నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు రైతుల సమస్యలు, వ్యవసాయ అభివృద్ధి, శాస్త్రీయ సాగు, ప్రభుత్వాల బాధ్యతలపై ప్రసంగించారు.

వ్యవసాయమే జిల్లాకు జీవనాధారం: 
 కలెక్టర్ బి.చంద్రశేఖర్

నల్లగొండ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడ సుమారు 15.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా ఇటీవల ఖరీఫ్‌లో 13 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. జిల్లాలో 66 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ప్రాంతంలో ఆధునిక సాగు పద్ధతులను పరిచయం చేసే అగ్రి షో నిర్వహించడం రైతులకు ఎంతో ప్రయోజనకరమన్నారు.. రాబోయే కాలంలో నీటి లభ్యతను అంచనా వేసుకొని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.​ రైతు భరోసాతోపాటు ఎంఐడీహెచ్, డ్రిప్, స్ప్రింక్లర్ పథకాల ద్వారా అందుతున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూనె గింజల సాగుకు నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, పప్పుధాన్యాల సాగుకు మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సెస్ పథకాలు ఉపయోగించుకోవచ్చన్నారు. ​అగ్రి షోలో 125 స్టాళ్ల ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలు, నూతన విత్తనాలు, ఉద్యాన పంటలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేస్తున్నామని తెలిపారు. రైతులు ప్రదర్శనను సందర్శించి పథకాలు, సాంకేతికతపై వివరాలు తెలుసుకోవాలని కోరారు.

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది : 
మేయర్ బుర్రి చైతన్య రెడ్డి

​రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతు పంట పండిస్తేనే సమాజానికి అన్నం లభిస్తుందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య రెడ్డి అన్నారు. రైతులకు ఉపయోగపడేలా నగరంలో వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. రైతులు కుటుంబ సమేతంగా అగ్రి షోను సందర్శించి కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకొని తమ పొలాల్లో అమలు చేయాలని కోరారు. రైతులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలకు నగర పాలక సంస్థ సహకారం అందిస్తుందని తెలిపారు.

​లాభసాటి వ్యవసాయం అందించాలి: జూలకంటి రంగారెడ్డి

​రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు వలస వెళ్లకుండా ఉండాలంటే సాగును లాభసాటిగా మార్చాలని ఏఐకేఎస్ మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. పంటలపై తగిన లాభాలు వచ్చినప్పుడే రైతులు వ్యవసాయాన్ని కొనసాగిస్తారని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలని కోరారు. ​ఏ భూమిలో ఏ పంట వేయాలి? ఎంత నీరు, విద్యుత్ అవసరం? ఎరువులు, పురుగుమందులు ఎంత మోతాదులో వాడాలి? అనే అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించే వ్యవస్థ ఉండాలని సూచించారు. ​ ఏఐకేఎస్ వందేండ్ల చరిత్రలో తొలిసారిగా నల్లగొండలో జాతీయ మహాసభ నిర్వహించడం గర్వకారణమన్నారు.

​శాస్త్ర సాంకేతికతతోనే రైతులకు మేలు : అగ్రి షో కన్వీనర్ నంద్యాల నరసింహారెడ్డి

​శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారానే రైతులు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించగలరని అగ్రి షో కన్వీనర్ నంద్యాల నరసింహారెడ్డి అన్నారు. ఐఓటీ విధానాలు, నూతన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను శాస్త్రీయంగా వినియోగించుకోవాలని సూచించారు. 125 స్టాళ్లలో డ్రోన్లు, ట్రాక్టర్లు, విత్తనాలు, సేంద్రీయ ఉత్పత్తులు, ఎరువులు, పురుగుమందులు, ఆధునిక సాగు పద్ధతులను ప్రదర్శిస్తున్నామని తెలిపారు. సీతాఫలం నుంచి ఐస్‌క్రీమ్ తయారీ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు, ఐఓటీ ఆధారిత సాగు విధానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. బయో ఫ్యాక్టరీ సంస్థ 150 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ పండ్లు, కూరగాయల ఎగుమతుల కోసం నల్లగొండను క్లస్టర్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరపల్లి వెంకటేశ్వర్లు, తుమ్మల వీరారెడ్డి, కందాల ప్రమీల, బండ పాలడుగు నాగార్జున, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, ఆర్ గురువారెడ్డి రమణారెడ్డి, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.

రైతుల శ్రేయస్సే లక్ష్యం.. ఆధునిక సాంకేతికతే ధ్యేయం

రైతుల అభ్యున్నతి, వ్యవసాయరంగ అభివృద్ధి, సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ అగ్రి షోను ఈ నెల 14 నుంచి 16 వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో వ్యవసాయానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలు, శాస్త్రీయ సాగు పద్ధతులు, ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

సాగు సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలు

​ప్రస్తుత వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులు, సాగునీటి కొరత, పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, కూలీల కొరత, చీడపీడల బెడద, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేయడం అగ్రి షో ప్రధాన ఉద్దేశం.

​ఆధునిక పరిజ్ఞానం

నాణ్యమైన విత్తనాలు, జీవ ఎరువులు, సేంద్రీయ వ్యవసాయం, కూరగాయల సాగు, పండ్ల తోటల పెంపకం, ఉద్యాన పంటలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ యంత్రాలు తదితర అంశాలను ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు చెందిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడంతోపాటు, ఆయా పద్ధతులను పొలాల్లో ఎలా అమలు చేయాలనే అంశాలను కూడా వివరించనున్నారు.

​డ్రోన్లు.. సోలార్ మోటార్లపై ప్రత్యేక ఆకర్షణ

డ్రోన్ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పంటలకు పురుగు మందుల పిచికారీ, ఎరువుల వినియోగం వంటి పనులను డ్రోన్ల ద్వారా వేగంగా, తక్కువ సమయంలో పూర్తి చేసే విధానాలను ప్రదర్శిస్తున్నారు. సోలార్ పవర్ వ్యవస్థలు, సౌర విద్యుత్ మోటార్లు, నాలుగు చక్రాల వాహనాలకు సోలార్ ఛార్జింగ్ సదుపాయాలపై ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ​వ్యవసాయంలో తేనెటీగల ప్రాధాన్యతను తెలియజేసేందుకు ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు.

రైతులకు విజ్ఞాన వేదిక అగ్రి షోను రైతులకు ఉపయోగపడే విజ్ఞాన వేదికగా తీర్చిదిద్దారు. రైతులు నేరుగా స్టాళ్లను సందర్శించి సాంకేతిక నిపుణులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, అగ్రి షో కన్వీనర్ నంద్యాల నర్సింహారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీఐటీయూ నాయకులు తుమ్మల వీరారెడ్డి తిలకించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్