Magazines

వచ్చే వారం జిన్‌పింగ్‌, పుతిన్‌తో ట్రంప్‌ భేటీ

23 నిమిషాల క్రితం

Trump to meet with Xi Jinping and Putin next week
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

తొలిసారిగా త్రైపాక్షిక సమావేశం.. అణు వ్యాప్తి నిరోధకంపై సంప్రదింపులు

వాషింగ్టన్‌ : వచ్చే వారం చైనా, రష్యా అధినేతలు జిన్‌పింగ్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశం అవుతారని వైట్‌హౌస్‌ తెలియజేసింది. మూడు దేశాల నేతలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. చైనాలో జరగనున్న ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార (అపెక్‌) సదస్సు సందర్భంగా ఈ భేటీ జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా అణు వ్యాప్తి నిరోధకంపై చర్చిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలను కలిగిన ఈ మూడు దేశాల మధ్య ఈ విషయంపై కొత్తగా ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నదని ట్రంప్‌ ఆశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల వినియోగాన్ని తగ్గించే విషయంపై అధ్యక్షుడు చర్చిస్తారని వైట్‌హౌస్‌ ప్రతినిధి ఒలివియా వేల్స్‌ చెప్పారు. అణ్వాయుధాల విస్తరణ అత్యంత ప్రమాదకరమని ఆయన భావిస్తున్నారని తెలిపారు.

ఒప్పందంపై అధికారుల సందేహాలు

అమెరికా, రష్యా మధ్య కుదిరిన అణు ఒప్పందం గడువు ఫిబ్రవరిలోనే ముగిసిపోయింది. కాగా ఈ సమావేశంలో అణు అంశాలపై కొత్తగా ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగానే కన్పిస్తున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. చర్చలకు ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని వారు అంటున్నారు. 'ఒప్పందం కుదురుతుందని మేము అనుకోవడం లేదు. ఇది కేవలం ప్రారంభ దశ మాత్రమే. మూడు దేశాల నేతల స్థాయిలో జరుగుతున్న మొదటి భేటీగా దీనిని పరిగణించవచ్చు' అని ఓ అమెరికా అధికారి అన్నారు. చైనా పర్యటనలో ట్రంప్‌తో పాటు వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ కూడా పాల్గనే అవకాశం ఉన్నదని, అయితే త్రైపాక్షిక సమావేశానికి మాత్రం ఆయన హాజరు కాబోరని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఇదిలావుండగా త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశంపై చైనా, రష్యా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్