Magazines

మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు

22 నిమిషాల క్రితం

Middle East
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 2 నిమిషాల చదవడం

బహ్‌రైన్‌లో అమెరికా రాడార్‌ కేంద్రంపై డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్‌

హార్ముజ్‌లో నౌకలపై పెరుగుతున్న దాడులు

టెహ్రాన్‌ : మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తన భూభాగంపై అమెరికా దాడి చేసిందని ఆరోపిస్తూ దానికి ప్రతీకారంగా శుక్రవారం తెల్లవారుజామున బహ్‌రైన్‌లోని ఓ అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్‌ దాడి జరిపానని ఇరాన్‌ ప్రకటించింది. కాగా బహ్‌రైన్‌లో అమెరికాకు చెందిన ముందస్తు హెచ్చరికల రాడార్‌ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశానంటూ ఇరాన్‌ చేసిన ప్రకటనను అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తోసిపుచ్చింది. బహ్‌రైన్‌ వైపు దూసుకొచ్చిన రెండు ఇరాన్‌ డ్రోన్లను మధ్యలోనే కూల్చివేశానని తెలిపింది. గత రెండు నెలల కాలంలో గల్ఫ్‌ దేశంలోని ఓ అమెరికా స్థావరంపై ఇరాన్‌ దాడికి యత్నించడం ఇదే మొదటిసారి. హార్ముజ్‌ జలసంధిలో సముద్ర దాడులు, బహ్‌రైన్‌పై డ్రోన్‌ దాడి, సౌదీ-హౌతీల మధ్య ఘర్షణలు ప్రాంతీయ భద్రతను మరింత సంక్షోభంలోకి నెట్టాయి.

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) చేసిన ప్రకటనను ఉటంకిస్తూ తస్నిమ్‌ వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం... సిరిక్‌లోని కమ్యూనికేషన్‌ టవర్‌పై అమెరికా వైమానిక దాడి జరిపింది. దానికి ప్రతీకారంగా ఐఆర్‌జీసీ ఏరోస్పేస్‌ దళాలు బహ్‌రైన్‌లో అమెరికా సేనలకు చెందిన 'ఎర్లీ వార్నింగ్‌ రాడార్‌'ను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేశాయి.

రెండు నెలలుగా సంయమనం పాటిస్తున్న టెహ్రాన్‌

గత కొన్ని వారాలుగా హార్ముజ్‌ జలసంధి పరిసరాల్లోని ఇరాన్‌ లక్ష్యాలపై అమెరికా దాడులు కొనసాగిస్తున్నప్పటికీ టెహ్రాన్‌ మాత్రం సెప్టెంబర్‌ నుంచే గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై దాడులకు దూరంగా ఉంటూ సంయమనం పాటిస్తోంది. అయితే హార్ముజ్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాణిజ్య నౌకలను మాత్రం అడ్డుకుంటోంది. ఇదిలావుండగా ఇజ్రాయిల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌ డైరెక్టర్‌ రోమన్‌ గోఫ్‌మన్‌ శుక్రవారం వాషింగ్టన్‌ డీసీలో పర్యటించారు. ఇరాన్‌పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించేలా అమెరికాపై ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఒత్తిడి పెంచుతున్న తరుణంలో ఈ పర్యటన జరగడం గమనార్హం.

అమెరికాతో సంబంధం లేకుండా ఇరాన్‌పై ఏకపక్షంగా దాడి చేసే విషయాన్ని కూడా నెతన్యాహూ పరిశీలించారని, అయితే ఈ ప్రణాళిక అమలుకు ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుమతి అవసరమని ఇజ్రాయిల్‌ వర్గాలు తెలిపాయి.

హార్ముజ్‌లో రికార్డు స్థాయిలో దాడులు

ఇరాన్‌తో తమకు ఎలాంటి ఒప్పందం అవసరం లేదని ట్రంప్‌ ప్రకటించిన మరునాడే బహ్‌రైన్‌పై దాడి జరిగింది. మరోవైపు హార్ముజ్‌ జలసంధిలో నౌకలపై దాడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత నెలలో 37 నౌకలపై దాడులు జరగ్గా ఈ నెలలో ఇప్పటి వరకూ కనీసం 14 దాడులు జరిగాయి. దాడులు జరుగుతున్నప్పటికీ మధ్యప్రాచ్యం నుంచి చమురు ఎగుమతులు వేగవంతమయ్యాయి. హార్ముజ్‌లో రికార్డు స్థాయిలో దాడులు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్