Magazines

రాజ్యాంగ విధ్వంసానికి కుట్ర

13 నిమిషాల క్రితం

Conspiracy to subvert the constitution
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 2 నిమిషాల చదవడం

నియంతృత్వ శక్తులను కలిసికట్టుగా ఎదుర్కొందాం
రాహుల్ గాంధీ నాయకత్వంలో మార్పు తథ్యం : ‘భారత్ సమ్మిట్’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు

న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్

దేశంలో రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, నియంతృత్వాన్ని రుద్దేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకే భావజాలం కలిగిన వారంతా కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. సామాన్యుల సంక్షేమం కోసం పాటుపడే రాహుల్ గాంధీ నాయకత్వంలోనే దేశంలో మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్-2.0’ సదస్సులో సీఎం ప్రసంగించారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు రెండు విరుద్ధ శక్తుల మధ్య పోరాటం జరుగుతోంది. ఒకవైపు రాజ్యాంగం, చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ప్రయత్నిస్తుంటే.. మరోవైపు వాటిని నాశనం చేయాలని కొన్ని శక్తులు చూస్తున్నాయి. దేశ పౌరులందరికీ ఓటు హక్కు ఉండాలన్నది మా ఆకాంక్ష. కొద్దిమందికే ఓటు హక్కు పరిమితం చేయాలన్నది వారి కుట్ర. పర్యావరణాన్ని పరిరక్షించాలని మేము తపిస్తుంటే, విధ్వంసం సృష్టించాలని వారు భావిస్తున్నారు. పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాము. కానీ వారు కేవలం తమ ధనిక మిత్రులు, బిలియనీర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నది మా లక్ష్యం కాగా, కొద్దిమంది చేతుల్లోనే అధికారాన్ని కేంద్రీకరించాలని వారు చూస్తున్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటుంటే, ఒకే వ్యక్తి, ఒకే పార్టీ ఆదేశాలతో పాలన సాగించాలని వారు నియంతృత్వ పోకడలకు పోతున్నారు’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

​​రాహుల్ గాంధీకి అండగా నిలవాలి

దేశంలో ఓటు హక్కు పరిరక్షణ కోసం, దళితులు, మైనారిటీలు, ఓబీసీల సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వాలు ధనికులకు కాకుండా సామాన్యులకు సేవ చేయాలన్నదే తమ విధానమన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశాన్ని రక్షించుకునేందుకు, ఈ సదస్సుకు విచ్చేసిన 70 దేశాల ప్రతినిధులు ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని కోరారు.

​

ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు

ప్రపంచీకరణ, కోవిడ్ మహమ్మారి తర్వాత అన్ని దేశాల్లోనూ ప్రాథమిక హక్కులపై దాడులు పెరిగాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగాలు, వైద్యం, ధరల పెరుగుదల వంటి సమస్యలతో సామాన్యులు సతమతమవుతున్నారని ఆవేదన చెందారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత మనందరిపై ఉందని, ఒక గొప్ప ఆశయం కోసం సాగుతున్న ఈ పోరాటాన్ని భూమిపై ఏ శక్తీ ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్