నీట మునిగిన షిప్... ప్రయాణికులు సురక్షితం
న్యూ ఓర్లీన్ : అమెరికాలోని న్యూ ఓర్లీన్ ఓడరేవు వద్ద మిసిసిపీ నదిలో ఆగి ఉన్న 'అమెరికన్ హెరిటేజ్' రివర్ క్రూయిజ్ నౌకను శుక్రవారం మధ్యాహ్నం 'అట్లాంటిక్ ఆస్ఫాల్ట్' అనే భారీ ట్యాంకర్ నౌక ఢకొీంది. ఈ ఘటనలో క్రూయిన్ నౌక నీటిలో మునిగిపోయి బోల్తా పడింది. అయితే అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు నౌక నుంచి కిందికి దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు ఐదు వందల అడుగుల పొడవున్న ట్యాంకర్ నౌక స్టీరింగ్ నియంత్రణను కోల్పోవడంతో అదుపుతప్పి డాకింగ్ చేసిన క్రూయిజ్ నౌకను ఢీకొన్నదని అమెరికా తీర గస్తీదళం ప్రాథమికంగా అనుమానిస్తోంది. ఈ ఘటనపై పుర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది.
ట్యాంకర్ బలంగా ఢీకొనడంతో క్రూయిజ్ నౌకలోకి వేగంగా నీరు చేరింది. ఆ తర్వాత కొద్ది సేపటికే నౌక ఓ వైపుకు ఒరిగిపోయి పూర్తిగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో 129 మంది ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 180 మందికి పైగా ఉన్నారు. నౌక మునిగిపోతుండడంతో కొందరు ప్రయాణికులు లైఫ్ జాకెట్లను ధరించి నదిలోకి దూకారు. హార్బర్ పోలీసులు, తీర గస్తీ దళం, అగ్నిమాపక సిబ్బంది, సమీపంలో ఉన్న టగ్‌బోట్ ఆపరేటర్లు వెంటనే స్పందించి నౌకలోని వారందరినీ కాపాడారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని న్యూ ఓర్లీన్ నగర మేయర్ హెలెనా మారెనో తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారికి స్థానిక హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. ఈ ఘటనను 'మిసిసిపీ నదిలో జరిగిన అద్భుతం'గా అధికారులు అభివర్ణించారు.






కామెంట్‌లు (0)