రష్యా, ఉక్రెయిన్, అమెరికా అంగీకారం
అబూదాబీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు జరిగే తదుపరి విడత శాంతి చర్చల్లో యూరప్ దేశాలను కూడా భాగస్వాములను చేయాలని అమెరికా, ఉక్రెయిన్, రష్యా అంగీకారానికి వచ్చాయి. సుమారు తొమ్మిది నెలల విరామం తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో అబూదాబీలో జరిగిన చర్చల అనంతరం ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) నేతల శిఖరాగ్ర సమావేశంలో యూరప్ తరఫున శాంతి చర్చల్లో పాల్గనే ప్రతినిధి బృందాన్ని ఎంపిక చేశారు. ఇందులో ఈయూ సంస్థలతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలండ్ భాగస్వాములుగా ఉంటాయని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు.
మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జేర్డ్ కుష్నర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తదుపరి విడత శాంతి చర్చల్లో యూరప్ ప్రతినిధులకు చోటు కల్పిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతోషం వ్యక్తం చేశారు. యూరప్ గడ్డపై యుద్ధం జరుగుతున్నందున భద్రతా హామీల విషయంలో ఆయా దేశాల గొంతుక చాలా అవసరమని ఆయన తెలిపారు.
ఈ నెల 10, 11 తేదీల్లో అబూదాబీలో జరిగిన త్రైపాక్షిక చర్చల సందర్భంగా యుద్ధ ఖైదీల మార్పిడిపై అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేత, పూర్తి స్థాయిలో కాల్పుల విరమణపై మాత్రం తుది నిర్ణయం జరగలేదు. శాంతి చర్చల్లో యూరప్ భాగస్వామ్యానికి రష్యా సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ ఆ దేశాల అసలు ఉద్దేశాలు, శాంతి ప్రక్రియకు అవి అందించే సహకారాన్ని బటి తుది స్వరూపం ఉంటుందని రష్యా అధ్యక్ష భవనం తెలిపింది.







కామెంట్‌లు (0)