Magazines

మీ పర్సనల్ విజన్

18 నిమిషాల క్రితం

Personal Vision
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 3 నిమిషాల చదవడం

భవిష్యత్తులోకి తొంగిచూడటం ఎట్లాగో పర్సనల్ విజన్ తెలియజేస్తుంది. రేపటి మీ భవితవ్యాన్ని మీ ఎదురుగా నిలబెడుతుంది. ఆ భవిష్య రూపానికి వాస్తవ రూపం ఇవ్వటానికి, వర్తమాన కాలంలో మీరు తీసుకోవల్సిన చర్యలు ఏమిటో కూడా తెలియజేస్తుంది.


మీ గదిలో ప్రశాంతంగా కూర్చోండి. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా కొంతసేపటి వరకూ ప్రశాంతంగా గడిపే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. కనులు మూసుకోండి. భవిష్యత్తు జీవితంలో మీరు ఎట్లా వుండనున్నారో మీ మనోచిత్రంలో దర్శించే విధంగా చూడండి. ఆ భవిష్యత్తు సరిగ్గా నేటినుంచి, కొన్ని నెలల తర్వాతది కావచ్చు, లేదా కొన్నేండ్ల తర్వాతది కావచ్చు. మీ వూహల్లో కనిపించే మీ చిత్రాన్ని గమనించండి. మీరు అపుడు ఏం చేస్తున్నారో గమనించండి. అప్పుడు మీతో ఎవరెవరు వున్నారో గమనించండి. అప్పుడు మీరు ఏది సాధించి వున్నారో గమనించండి. ఆనాటి భవిష్యత్తు జీవితంలో మీకు ఏది ముఖ్యమో తిలకించండి. మీ చుట్టూ వున్న వ్యక్తులు మీకు ఏ విధంగా సంబంధిత వ్యక్తులుగా కనబడుతున్నారో గమనించండి. మీ మనోభావాలు మీ రూపానికి ఎంత దగ్గరగా వున్నాయో తెలుసు కోవటానికి ప్రయత్నించండి.

మీ ఎదురుగా కనబడే మీ రూపాన్నే “మీరు”గా గుర్తించండి. ఫీల్ అవ్వండి. అదే మీ నిజమైన రూపంగా భావించండి. ఇప్పుడు మీ కళ్ళు తెరవండి. ప్రస్తుతం వున్న మీ రూపాన్ని దర్శించండి. వర్తమాన జీవితంలో మీ జీవితాన్ని దర్శించండి. మీ భవిష్యత్తును ఇందాక మీరు తిలకించిన కోణంలో నేటి మీ వర్తమాన జీవితాన్ని దర్శించండి. అపుడు మీకు కొన్ని విషయాలు అవగతమవుతాయి. మీ భవిష్య రూపాన్ని మీరు నిజం చేసుకోవటానికి, మీ వర్తమాన జీవితంలో మీ వర్తమాన రూపంలో చేపట్టవల్సిన మార్పులు మీకు బోధపడతాయి. మీ భవిష్యత్తు విజన్‌ను వాస్తవరూపంగా మార్చుకొనటానికి శక్తిమంతంగా మలుచుకోవటానికి మీరు చేయవల్సిన కర్తవ్యం ఏమిటో మీకు బోధపడుతుంది. విజన్ స్టేట్మెంట్ రాసుకోవడం మాదిరిగానే, విజన్ ఫ్యూచర్ ఎక్సర్సైజు ఈ సక్సెస్ మెకానిజాన్ని ప్రేరేపితం చేస్తుంది.

ఉత్తేజపరుస్తుంది. పర్సనల్ విజన్ మీ భవిష్య రూపాన్ని మీ కనుల ముందర వుంచుతుంది. మీ అసలు స్వరూపం ఏమిటో మీకు కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అది మీ వాస్తవరూపం, భవిష్యత్తులో మీరు గడప బోయే రూపం, ఫలితాత్మకమైన పర్సనల్ విజన్‌లో మీ జీవితానికి మీ కెరీర్‌కు ఏదేది ముఖ్యమో, అవన్నీ రంగరించి వుండేలా చేస్తుంది. మీరు ఏం కావాలనుకుంటున్నారో తెలిపే చిత్రపటం ఇది. మీరు ఏమి చేయాలని కాంక్షిస్తున్నారో తెలిపే ‘వూహ’ ఇది. మీరు ఏ కోవకు చెందిన మనోభావాలను కలిగివుండాలో తెలిపే సన్నివేశం ఇది. మీరు దేనిని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారో తెలిపే చిత్రం ఇది. మీరు ఎవరెవరితో, ఏ రకపు సంబంధాలను కల్గి వుండాలని భావిస్తున్నారో తెలిపే భావన ఇది. మీ పర్సనల్ విజన్ మీ భవిష్యత్తు ఏమిటో తెలిపేది అయినప్పటికీ, ఆ రూపాన్ని మీరు శాశ్వతం చేసుకోవాలంటే, నిర్మింపచేయదల్చుకుంటే అందుకు మీరు వేయవలసిన పునాది కార్యక్రమాలను మీ వర్తమాన జీవితంలో చేసుకోవల్సి వుంటుంది.

ఉదాహరణకు మీరు ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా మీ పర్సనల్ విజన్ని ఏర్పరచుకున్నా రనుకుందాం. ఐదేండ్ల తర్వాతనో, పదేండ్ల తర్వాతనో మీరు ఒక గొప్ప పారిశ్రామిక వేత్తగా వున్నట్లు మీరు మీ పెర్సనల్ విజన్లో దర్శించినట్లయితే, అది వాస్తవంగా మారాలంటే పారిశ్రామికవేత్తగా మారటానికి చేయవల్సిన మౌలిక చర్యలకు ఈ వర్తమాన కాలంలోనే మీరు చేపట్టవల్సి వుంటుంది.  మీరు ఏ గమ్యానికి చేరనున్నారో మీ పర్సనల్ విజన్ తెలుపుతుంది.  ఆ గమ్యానికి మీరు ఎలా చేరుకోవాలన్నది మీ విజన్ స్టేట్మెంట్ తెలియ పరుస్తుంది. మీ విజన్ స్టేట్మెంట్‌‌ను ఎట్లా రూపొందించుకోవాలో తెలుసుకుందాం. నేను మొదట్లో చెప్పిన ఎక్సర్సైజుని క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేయండి. మొదట్లో మీకు అంత స్పష్టంగా వుండే విజన్ ఏర్పడక పోవచ్చు. తలాతోకా లేని ఊహా చిత్రాలు ఏర్పడవచ్చు. కొద్దిరోజులపాటు ఈ ఎక్సర్సైజు చేసిన పిదప, క్రమంగా మీ ఆలోచనలు సర్దుకుని ఒక స్పష్టమైన రూపం మీ ఎదుట సాక్షాత్కరించవచ్చు.


డా.హిప్నో పద్మా కమలాకర్‌ 9390044031 కౌన్సెలింగ్‌ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్