ఇప్పటికే వివిధ వర్గాలకు బీమా సౌకర్యం
కుటుంబంలో ఒక్కరికే నిబంధనతో సరికొత్త చిక్కులు
రేషన్‌కార్డులు - ఆధార్ అనుసంధానంతో తగ్గనున్న లబ్దిదారులు
లోపభూయిష్టంగా ప్రణాళికాశాఖ విధివిధానాలు
ఎస్ఎస్ఆర్ శాస్ర్తి
''మహిళా స్వయం సహాయక బృందంలోని సభ్యురాలు రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆ గ్రూపునకు రూ.10 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీం ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ జీవిత బీమా కూడా తీసుకుంటే, ఆ రూ.10 లక్షలతో పాటు 'ఇందిరమ్మ' ద్వారా వచ్చే రూ.5 లక్షలు కూడా ఇస్తారా?'' అలాగే రాష్ట్రంలో వివిధ వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఇవి కొనసాగుతూనే ఇందిరమ్మ జీవిత బీమా కూడా వర్తిస్తుందా? లేక పాత బీమాను రద్దు చేస్తారా? రాష్ట్రంలో 1 కోటి 60 లక్షల తెల్లరేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందిరమ్మ జీవిత బీమాను 1 కోటి 15 లక్షల మందికి వర్తింప చేస్తామని రాష్ట్ర మంత్రివర్గం ప్రకటించింది. దానికోసం ప్రణాళికా శాఖ ఈనెల 21న విధివిధినాలు ఖరారు చేసింది. డిసెంబర్ 14లోపు దరఖాస్తులు చేసు కోవాలని సూచించింది. చిక్కుముడులు రేషన్‌కార్డును యూనిట్‌గా తీసుకుంటే ఆధార్ అనుసంధానం సమస్యగా మారుతుంది. ఇప్పటికే రేషన్‌కార్డుల్లోని లబ్దిదారుల పేర్లన్నీ ఆధార్‌తో అనుసంధానం అయి ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఇప్పటికే అందిస్తున్న జీవిత, ప్రమాద బీమా పథకాలు పునరావృతం అవుతున్నాయి. పాత స్కీంలలో ఇన్సూరెన్స్ మొత్తం రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే, ఇందిరమ్మ జీవిత బీమా ద్వారా 'తగ్గిన' పరిహార సొమ్మును భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయా? అసలు వివిధ శాఖల వద్ద ఉన్న బీమా వివరాలను ఒకే డేటాబేస్‌లో సమీకరించి, ఒకటి కంటే ఎక్కువ పథకాలలో ఉన్న వ్యక్తులను మినహాయించి ప్రత్యేక లబ్ధిదారుల సంఖ్యను వెల్లడిస్తారా? ఇందిరమ్మ జీవిత బీమా విధివిధానాలపై పూర్తిస్థాయి కసరత్తు లేకుండానే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఉదారంగా లబ్దిదారులను ఎంపిక చేసినా, బీమా కంపెనీలు చివరి క్షణంలో కొర్రీలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ విధివిధానాలను సమీక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది.
వీటి సంగతేంటి?
ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన (పీఎమ్‌జేజేబీవై) రూ.2 లక్షల జీవిత బీమా- 18-50 ఏండ్లు- వార్షిక ప్రీమియం రూ.436/-
2026 జనవరి 7 నాటికి 47,43,677 మందికి పాలసీలు ఉన్నాయి.
రైతు బీమా - రూ.5 లక్షలు - 18 నుంచి 59 ఏండ్లు 2025-26లో 42.16 లక్షల మందికి పైగా నమోదయ్యారు. 2026 జూన్ 18న ఎల్ఐసీకి రూ.1,359.56 కోట్లు ప్రీమియం చెల్లించారు. 2025 మార్చి 1 నాటికి 1,50,002 మంది రైతులకు రూ.7,500.10 కోట్లు బీమా పరిహార సొమ్ము చెల్లించారు.
నేతన్న భద్రత బీమా- రూ.5 లక్షలు 2024-25లో 36,333 మంది నమోదు. వయో పరిమితి 18-59 ఏండ్లు.
కల్లుగీత కార్మికుల ప్రమాద బీమా - రూ. 5 లక్షలు - ఆసరా పెన్షన్ల లెక్క ప్రకారం 65,668 మంది నమోదు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎమ్ఎస్బీజీ) రూ.2 లక్షల ప్రమాదబీమా మరణం, పూర్తి వైకల్యం రూ.2 లక్షలు పాక్షిక వైకల్యం రూ.1 లక్ష - వార్షిక ప్రీమియం రూ.20/- 2025 అక్టోబర్ 29 నాటికి 1,88,08,831 మంది నమోదు.
మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) 60 ఏండ్లలోపు మహిళలు . 2024 మార్చి నుంచి అమలు. రూ.10 లక్షల ప్రమాద బీమా. రాష్ట్రంలో 65,85,247 మంది సభ్యులతో 6,33,198 మహిళా స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. వీరికి రుణ బీమా/ ప్రమాద బీమా వేర్వేరుగా ఉన్నాయి.
ఇవీ ప్రశ్నలు
పాత బీమా పథకాలు కొనసాగుతాయా?
ప్రీమియం చెల్లింపులు ఏ శాఖ భరిస్తుంది?
ఒక్కో వ్యక్తిపై వార్షిక
ప్రీమియం ఎంత?
ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం
పథకమేనా? కేంద్రం వాటా ఉందా?
ఏదైనా మరణం సంభవిస్తే ఇందిరమ్మ జీవిత బీమాతో పాటు, ఇతర
ప్రభుత్వ బీమా పథకాలు కూడా
వర్తిస్తాయా.. లేదా?
ఆ మేరకు ప్రజలకు
ఆర్థిక లబ్ది చేకూరుతుందా...లేదా?






కామెంట్లు (0)