Magazines

ఇంటర్‌ విద్య విలీనంపై పునరాలోచించాలి

9 నిమిషాల క్రితం

education
avatar
balaji

ప్రచురించబడింది నవం 25, 2026 | 2 నిమిషాల చదవడం

ఏకపక్షంగా ముందుకెళ్లొద్దు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను దశల వారీగా 2030 నాటికి పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదన సరిగాదనీ, ఈ విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లొద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ సూచించారు. విద్యారంగంలో మార్పులు చేపట్టే ముందు విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు, రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులతో సమగ్ర చర్చలు జరిపి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జాతీయ నూతన విద్యావిధానం-2020ను అమలుకు పూనుకోవడం సరిగాదని సూచించారు. డ్రాపౌట్స్ పేరుతో ఉన్నత పాఠశాలల్లోనే 11, 12 తరగతులను ప్రారంభించి, నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు ఒకే క్యాంపస్‌లో నిర్వహించినంత మాత్రాన విద్యార్థుల సంఖ్య పెరగదనీ, నాణ్యమైన విద్య అందదని స్పష్టం చేశారు.

డ్రాపౌట్లకు కారణమవుతున్న ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల కొరతను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలనీ, అన్ని గ్రూపులను అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. విలీనం పేరుతో ఏ ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా మూసివేయొద్దని సూచించారు. అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ భద్రత, క్యాడర్, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలు, జీతభత్యాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 15 శాతం కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫోస్టోలో పేర్కొని కేవలం 8.23 శాతానికే పరిమితమైందని విమర్శించారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఆధిపత్యం, అధిక ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టకుండా విద్యా నిర్మాణంలో మార్పులు చేపట్టడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలగదని స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోకూడదని హితవు పలికారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాలని సూచించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్