విధుల్లో ఉండగానే మరణించినట్టు నకిలీ పత్రాల సృష్టి
చనిపోయిన తేదీని మార్చి.. కొడుక్కి ఉద్యోగం
రూ.13 లక్షలకు బేరం..
మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల్లో కుమ్మక్కు
14 మంది అరెస్ట్..
మరో ఇద్దరు పరారీ.. రూ.5 లక్షలు స్వాధీనం : ఎస్పీ శరత్‌చంద్ర పవార్
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ వ్యక్తి చనిపోయిన తేదీనే మార్చేశారు! ఉద్యోగ విరమణ చేసిన ఐదు నెలల తర్వాత ఆయన మరణిస్తే.. విధుల్లో ఉండగానే చనిపోయినట్టు నకిలీ రికార్డులు సృష్టించారు. ఆయన కుమారుడికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ కొలువు కట్టబెట్టారు. ఇందుకోసం ఆధార్ చిరునామా మార్చడంతోపాటు మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల్లోని కొందరు అధికారులు, సిబ్బంది కుట్రలో భాగస్వాములయ్యారు. రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని సాగించిన ఈ మోసాన్ని నల్లగొండ పోలీసులు ఛేదించారు. మొత్తం 16 మంది పాత్రను గుర్తించి 14 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.5 లక్షలు, కంప్యూటర్, ప్రింటర్, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్రపవార్ వివరాలు వెల్లడించారు.
ముందుగానే చనిపోయినట్టు రికార్డులు
శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సహాయకుడిగా పని చేసిన చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న ఉద్యోగ విరమణ పొందారు. అనారోగ్యంతో అదే ఏడాది నవంబర్ 17న మరణించారు. అయితే ఆయన 2025 మే 28న విధుల్లో ఉండగానే చనిపోయినట్టు రికార్డులు సృష్టిస్తే కుమారుడికి కారుణ్య ఉద్యోగం వస్తుందని కుటుంబ సభ్యులు, బంధువులు భావించారు. కొందరు ఉద్యోగులతో కలిసి కుట్ర పన్నారు. ఈ వ్యవహారంలో మృతుని భార్య వసంతతో రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆధార్ చిరునామా మార్పు
బంధువులైన రాజశేఖర్, రవీందర్ సమన్వయంతో మీ సేవా కేంద్రం నిర్వాహకుడు పనస చంద్రశేఖర్ అలియాస్ చందు ద్వారా వెంకటేశ్వర్లు ఆధార్‌లో చిరునామాను నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీకి మార్చారు. ఈ ఆధారంతో 2025 మే 28న వెంకటేశ్వర్లు మరణించినట్టు నల్లగొండ మున్సిపాలిటీ నుంచి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం పొందారు. ఇందులో వార్డు అధికారి శివ జనార్ధన్, పారిశుధ్య పర్యవేక్షకుడు ప్రదీప్ రెడ్డి తదితరులు నిబంధనలకు విరుద్ధంగా సహకరించారు. మృతుని మేనల్లుడు కట్ల సతీష్‌తోపాటు మరో ఇద్దరితో దరఖాస్తుపై సంతకాలు చేయించారు. దాంతో శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఆకుల కృష్ణసూర్య శిల్ప సంబంధిత దరఖాస్తును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి పంపించారు. ఈ పత్రాల ఆధారంగా మృతుని కుమారుడు చామకూరి రాజుకు కారుణ్య నియామకం కింద దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు.
కమిషనర్ ఫిర్యాదుతో వెలుగులోకి..
నల్లగొండ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు ఈ నెల 4న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో డీఎస్పీ కె.శివరామిరెడ్డి పర్యవేక్షణలో సీఐ కె.ఆది రెడ్డి, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది దర్యాప్తు చేపట్టి మోసాన్ని ఛేదించారు. అరెస్టయిన వారిలో మృతుని భార్య చామకూరి వసంత, కుమారుడు చామకూరి రాజు, రాచకొండ వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ గౌడ్, శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధరెడ్డి , వైద్యాధికారి ఆకుల కృష్ణ సూర్యశిల్ప, గుండ్లపల్లి మీసేవా కేంద్రం నిర్వాహకుడు పనస చంద్రశేఖర్ అలియాస్ చందు,12వ తెలంగాణ ప్రత్యేక పోలీసు బెటాలియన్ కంప్యూటర్ ఆపరేటర్ కట్ల సతీష్, నల్లగొండ శ్రీకృష్ణనగర్ వార్డు అధికారి ముక్కముయిల శివ జనార్ధన్, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య పర్యవేక్షకుడు ఎన్. ప్రదీప్ రెడ్డి, నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం సూపరింటెండెంట్ నాగిరెడ్డి జితేందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ పోలె రంజిత్ కుమార్, పరిపాలనాధికారి మహబూబ్ అలీ, సీనియర్ అసిస్టెంట్ గింకల రాకేష్ యాదవ్, జూనియర్ అసిస్టెంట్ తుంగతుర్తి మోహన్ కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారి చామకూరి రాజశేఖర్, కేతెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య సహాయకుడు చామకూరి రవీందర్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.5 లక్షలు, కంప్యూటర్, ప్రింటర్, 12 సెల్‌ఫోన్లు, మృతుని ఫొటోను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు.






కామెంట్‌లు (0)