ఓపీఎస్ పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ
అధ్యయనానికి కమిటీ
వేస్తామన్న సీఎస్
నెలల తరబడి సర్కారు కాలయాపన
ఉద్యోగుల్లో అసంతృప్తి
పోరుబాటకు సన్నద్ధత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. దీంతో సీపీఎస్ ఉద్యోగులు ఎంతో ఆశగా కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా సీపీఎస్ రద్దుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ఇంకోవైపు రాష్ట్రంలో సీపీఎస్ రద్దు అంశాన్ని పరిశీలించేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్‌జాజు సెప్టెంబర్ తొమ్మిదిన హామీ ఇచ్చారు. మూడు నెలల కాలపరిమితి ఉంటుందని కూడా ప్రకటించారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం సీపీఎస్‌పై అధ్యయన కమిటీని నియమించలేదు. దీంతో సీపీఎస్ రద్దు ఎప్పుడవుతుందోననీ, అధ్యయన కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్రంలోని 2.68 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్‌తో ఇబ్బందులు
ఓపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ ఉన్నది. ఉద్యోగి చివరి వేతనంలో 50 శాతం ప్రతినెలా పెన్షన్‌ను పొందుతారు. దీంతో వారి భవిష్యత్తుకు, కుటుంబ భద్రతకు ఇబ్బంది లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. అంటే ఆ ఏడాది సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకమైన ఉద్యోగులకు సీపీఎస్ వర్తిస్తుంది. అయితే సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ లేదు. దీంతో సీపీఎస్ ఉద్యోగులకు, వారి కుటుంబానికి సామాజిక భద్రత కరువైంది. సీపీఎస్ విధానంలోని ఉద్యోగి, ప్రభుత్వం పది శాతం చొప్పున వాటాలను పెన్షన్ ఖాతాలో జమ చేయాలి. ఉద్యోగ విరమణ తర్వాత వారికి షేర్ మార్కెట్ పెట్టుబడుల రాబడిపై ఆధారపడి పెన్షన్ ఉంటుంది. దీంతో ఏ ఉద్యోగికి ఎంత పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముల్కనూరు రాజయ్య ఉపాధ్యాయునిగా పనిచేసి ఆగస్టులో ఉద్యోగ విరమణ పొందారు. ఆయన చివరి నెల వేతనం 91,800 వచ్చింది. ఓపీఎస్ ఉద్యోగికి అయితే రూ.45,900 పెన్షన్ వస్తుంది. కానీ ఆయన సీపీఎస్ ఉద్యోగి కావడం షేర్ మార్కెట్ ఆధారంగా నిర్ణయించడంతో రూ.4,200 పెన్షన్ మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో రూ.1,500 నుంచి రూ.ఐదు వేల వరకు తక్కువ పెన్షన్ రావడం వల్ల ఉద్యోగ విరమణ తర్వాత సీపీఎస్ ఉద్యోగి కుటుంబ పోషణ, ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. సుమారు రెండు వేల మంది రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఏటా సుమారు పది వేల మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. రిటైర్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తే ఈ బకాయిలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి మారేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2004 సెప్టెంబర్ ఒకటికి ముందు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలై ఆ తర్వాత విధుల్లో చేరిన వారికి వన్ టైమ్ ఆప్షన్ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. వచ్చేనెల 31లోగా నిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. సర్వీసులో ఉన్న వారు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు కుటంబ పెన్షన్లర్లూ ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది. ఇంకోవైపు సీపీఎస్‌ను రద్దు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది.
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని కర్నాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఐదున ప్రకటించారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాయి. తెలంగాణ ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటోందనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
17న ఉద్యోగుల సామూహిక సెలవు
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేం దుకు ఉద్యోగులు ఉద్యమబాట పట్టనున్నారు. ఈనెల 17న సామూహిక సెలవు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌సీపీ ఎస్‌ఈయూ) ప్రకటించింది. పీఆర్సీ నివేదిక తెప్పించుకోవాలనీ, పెండింగ్‌లోని డీఏలు చెల్లించాలనీ, సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ జేఏసీ కూడా ఉద్యమబాట పట్టాలని నిర్ణయించింది. త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటించనుంది. పీఆర్సీ అమల్లో జాప్యం జరిగితే మరో పోరాటానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని టీఎస్‌యూటీఎఫ్ పిలుపునిచ్చింది.






కామెంట్‌లు (0)