ఏక్యూఐ 160 పాయింట్లకుపైగా నమోదు
ప్రమాకర స్థాయిలో పీఎం 2.5 ధూళి కణాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దీపావళి పండగ సందర్భంగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు పేల్చిన బాణాసంచా హైదరాబాద్ ప్రజలకు తలనొప్పితెచ్చిపెట్టింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీగా టపాసులు కాల్చడంతో గాలి నాణ్యత(ఏక్యూఐ) ఆదివారం రాత్రి ఒక్కసారిగా పడిపోయింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు సగటు160 పాయింట్లకు పెరిగిపోయింది. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల సమయంలో పలు ప్రాంతాల్లో 500 పాయింట్లు దాటిపోయింది. హైదరాబాద్ నగర యావరేజ్ సగటు 80 పాయింట్లుగా మాత్రమే. దీనినిబట్టి చూస్తే సాధారణ రోజులతో పోలిస్తే గాలిలో కాలుష్య కారకాల తీవ్రత రెట్టింపు అయ్యిందని స్పష్టమవుతున్నది. పొగ, సూక్ష్మ ధూళి కణాలు గాలిలో కలిశాయి. దీంతో ఆస్తమా, శ్వాసకోశ సమస్యలున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండగ ఆనందం కోసం కాల్చిన టపాసులు చివరకు ప్రజల ఆరోగ్యానికి సవాలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పీఎం2.5, పీఎం10 వంటి సూక్ష్మ ధూళి కణాలు గాలిలో ఎక్కువగా చేరాయి. పీఎం 2.5 ధూళి కణాలు డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనల ప్రకారం 24 గంటల సమయంలో 15 g/m కంటే ఎక్కువగా ఉండొద్దు. కానీ, హైదరాబాద్‌లో 60 g/m దాటి పోయింది. అంటే సోమవారం ఒక్కరోజే పీఎం 2.5 ధూళికణాలు నాలుగు రెట్లు పెరిగాయి. అత్యంత చిన్నవైన పీఎం2.5 కణాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల లోతైన భాగాలకు చేరే ప్రమాదముంది. దీంతో దగ్గు, గొంతు మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నవారిలో లక్షణాలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా అధిక కాలుష్యం ప్రమాదకరంగా మారవచ్చు. మరోవైపు టపాసుల పొగ వల్ల కళ్లలో మంట, నీళ్లు కారడం, అలర్జీ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కార్తీక పౌర్ణమి వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశమున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఏఐక్యూ అసలెంతుంటే ప్రమాదకరం....
గాలి ఎంతవరకు స్వచ్ఛంగా ఉందో తెలుసుకోవడానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఉపయోగిస్తారు. మన దేశంలో అమలవుతున్న ప్రమాణాల ప్రకారం ఏక్యూఐ సున్నా నుంచి 50 మధ్య ఉంటే గాలి నాణ్యత మంచిదిగా పరిగణిస్తారు. 51 నుంచి 100 వరకు సంతృప్తికరంగా, 101 నుంచి 200 వరకు మోస్తరు కాలుష్యంగా గుర్తిస్తారు. 201 నుంచి 300 మధ్య ఉంటే పేలవమైన గాలి నాణ్యతగా వర్గీకరిస్తారు. 301 నుంచి 400 వరకు అత్యంత పేలవంగా, 401 నుంచి 500 వరకు తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నమోదైన 160 ఏక్యూఐ మోస్తరు విభాగంలో ఉంది.
దేశంలో అత్యధికంగా నమోదైన ప్రాంతాలివే...
పంజాబ్ రాష్ట్రంలోని మండి గోవింద్‌గర్‌లో అత్యధికంగా ఏక్యూఐ 445 పాయింట్లు దాటింది. దేశరాజధాని ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో 400 పాయింట్లు దాటింది. సగటున చూస్తే 344 పాయింట్లుగా నమోదైంది.






కామెంట్‌లు (0)