పోలేపల్లి ఎల్లమ్మ తల్లిపై ఆన
కేటీఆర్ పది జన్మలెత్తినా రేవంత్ కాలేరు
మోడీనైనా కేడీనైనా ఎదిరిస్తా
రాబోయే రోజుల్లో వేలకోట్ల పెట్టుబడులు తెస్తా..
కేసీఆర్ అప్పులకు రూ.2 లక్షల కోట్లకుపైగా చెల్లించాం
నాకు అప్పు చేసే, అబద్ధాలు చెప్పే అలవాట్లు లేవు
కేసీఆర్ తింటే బకాసురుడు.. పడుకుంటే కుంభకర్ణుడు
సంక్రాంతి తరువాత ప్రజాబలం పేరుతో వస్తా : లగచర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
‘ఎవరు అడ్డమొచ్చినా.. అడ్డు వచ్చినా వారిని తొక్కుకుంటూ కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొస్తా, కొడంగల్ భూముల్లో పచ్చని పంటలు పండేలా చేసే బాధ్యత నాది. ఇది పోలేపల్లి ఎల్లమ్మ తల్లిపై ఆన’ అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. కేసీఆర్ అప్పులకు, తప్పులకు ఈ 34 నెలల్లో రూ.2 లక్షల కోట్లకుపైగా చెల్లించామని తెలిపారు. ప్రజల అండ ఉంటే మోడీనైనా.. కేడీనైనా.. ఎదిరిస్తానని అన్నారు. మూడురోజుల కొడంగల్ పర్యటనలో భాగంగా సోమవారం లగచర్ల ఇండస్ట్రీరియల్ కారిడార్‌లో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. అంతకుముందు రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి పాదయాత్రగా లగచర్ల వరకు చేరుకున్నారు. ఈ సభకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, దామోదర రాజానర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వాకిటి శ్రీహరి, ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినా వలసలు ఆగలేదన్నారు. మన ప్రాజెక్టులు పూర్తి కాలేదని, మన పొలాలకు నీళ్లు అందించలేదని తెలిపారు. 75 ఏండ్లలో ఒకరిని అడిగే పరిస్థితే తప్ప కావాల్సింది చేసే సమయం రాలేదన్నారు. ఆనాడు పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారను కున్నామన్నారు. తెలంగాణ వచ్చినా.. ముఖ్యమంత్రిగా బాధ్యత ఇచ్చినా పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్‌కు పోయిండని తెలిపారు. భుజాలపై మోసిన పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేండ్లు పడావు పెట్టాడని ఆరోపించారు. 2023లో కొడంగల్ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ఏ ఒక్కరోజు సెలవు తీసుకోలేదన్నారు. పదేండ్లలో కేసీఆర్ రూ.8 లక్షల 11 వేల కోట్లు అప్పు పెట్టి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని తెలిపారు. 11 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు చూసి చలించి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే 2024 జనవరి 1 నుంచి ప్రతి నెలా మొదటి తారీఖున జీతాలు వేస్తున్నామని అన్నారు. ‘అసెంబ్లీలో మాట్లాడదాం రమ్మంటే కేసీఆర్ రాడు.. ఆయన తింటే కుంభకర్ణుడు.. పంటే బకాసురుడు’ అని సీఎం అన్నారు. తనకు అప్పు చేసే అలవాటు.. అబద్ధాలు చెప్పే అలవాటు లేదన్నారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులు తాము మొదలు పెడితే.. కేసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటున్నారన్నారు. తాము లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేసుకుంటే వారికి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. వారు తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. కేటీఆర్ గడ్డం పెంచుకున్నా .. మోకాళ్ల వరకు పెంచినా ..పది జన్మలెత్తినా కేటీఆర్ రేవంత్ రెడ్డిలా కాలేడన్నారు. దానికి గుండెధైర్యం, నమ్ముకున్న వారికోసం నిలబడే తెగువ కావాలన్నారు. ఆనాడు కొడంగల్ బిడ్డలు చదువుకోవాలంటే పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉండేదని, నేడు కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా చేసి.. ఉన్నత చదువులకు కొడంగల్ వచ్చేలా చేసుకుంటున్నామన్నారు. కొడంగల్ అభివృద్ధి జరుగుతుంటే కొందరు ఏడుపులు మొదలు పెట్టారని అన్నారు. ఈ రోజు రూ.9 వేల కోట్లతో కొడంగల్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని తెలిపారు. సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో ప్రజల్లోకి వస్తామన్నారు. అందరం కలసికట్టుగా ఎల్‌నినోను ఎదుర్కొందామని పిలుపు నిచ్చారు. ప్రజాబలంతో సునామీ సృష్టిస్తానని, ఆ సునామీలో మోడీ, కేడీ కొట్టుకుపోతారని అన్నారు. జర్నలిస్టులు అధైర్యపడొద్దని, వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని స్పష్టం చేశారు.






కామెంట్లు (0)