రంగారెడ్డిలో అత్యధికంగా అసెంబ్లీ సీట్ల పెంపు
అత్యల్పంగా ఖమ్మం, నిజామాబాద్‌లో నాలుగేసి స్థానాలు
డీ లిమిటేషన్‌తో ఆశావాహుల్లో ఆనందం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ఎంపీ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించడం లాంచనమే అని భావిస్తున్నారు. దీనికి చట్టబద్దత లభిస్తే భారత రాజకీయ చరిత్రలో ఈ ప్రక్రియ కొత్త విధానానికి నాంది కానుంది. 50 శాతం పెంపు ఆధారంగా పునర్విభజనకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తే తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలు 60 పెరిగి, 179కి, లోక్‌సభ స్థానాలు మరో 9 పెరిగి 26కు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల కోసం గతంలో పోటీ పడి చివరి నిమిషంలో అవకాశం దక్కని ఆశావాహులకు పెంపు సంతోషం కల్గిస్తోంది. మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, భువనగిరి ఎంపీ నియోజకవర్గాల పరిధిలో జనాభా అధికంగా ఉండటంతో వీటిని విభజించి కొత్తగా 4 నియోజక వర్గాలను ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి కొత్తగా రెండు ఎంపీ స్థానాలు రానున్నాయి. ఉమ్మడి మెదక్‌లో ప్రస్తుతం మెదక్, జహీరాబాద్ ఉండగా కొత్తగా మరొకటి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్‌ను విభజించి అదనంగా మరొకటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలను విభజించి మరో రెండు స్థానాలను ఏర్పాటుచేస్తారు.








కామెంట్‌లు (0)