​కల్లాల్లో వడ్లు.. కండ్లల్లో కన్నీళ్లు!

1 గంట క్రితం

Paddy
avatar
balaji

ప్రచురించబడింది నవం 28, 2026 | 3 నిమిషాల చదవడం

దళారుల దోపిడీ.. సర్కారు మొద్దునిద్ర! ​అన్నదాతకు అప్పుల ఉరి.. మిల్లర్ల సిండికేట్ సిరి!

అలసత్వం శాపమై.. 
అకాల వర్షం ఆగమాగం చేసి..! రోజు రోజుకూ ధర పతనం

కాగితాలకే బోనస్.. బహిరంగ మార్కెట్‌‌లో మద్దతు ధర మాయం

​దళారుల గిడ్డంగులు నిండాక కొనుగోలు కేంద్రాలు తెరుస్తారా?

​తడిసిన ధాన్యాన్ని
 మద్దతు ధరకే కొనాలి : సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి
 నున్నా నాగేశ్వరరావు డిమాండ్


నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎల్‌నినో, తుఫాన్‌‌లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న అరకొర పంటనైనా అమ్ముకుని అప్పులు తీర్చుకుం దామనుకున్న రైతులకు కొనుగోలు కేంద్రాల జాప్యం పెద్ద శాపంగా మారింది. ధాన్యం కల్లాల్లో రైతుల ఇండ్లలో మూలుగుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవు తున్నారు. ఈ అవకాశాన్ని వాడుకున్న ప్రయివేట్ వ్యాపారు లు, మిల్లర్లు సిండికేట్‌గా మారి ధరలను అమాంతం పడేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. మద్దతు ధర, బోనస్ మాట దేవుడెరుగు.. వడ్డీ అప్పుల ఒత్తిడితో రైతులు అడిగిన కాడికే పంటను తెగనమ్ముకోవాల్సిన దయనీయ స్థితి నెలకొంది. రైతు చేతిలో ధాన్యం ఉన్నప్పుడే కొనుగోలు చేయని ప్రభుత్వ నిర్లక్ష్యంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ​ఆరుగాలం శ్రమించి, చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చిన వేళ అన్నదాత ముఖంలో ఆనందం వెల్లివిరియాల్సింది పోయి, కల్లాల్లోనే కన్నీరుమున్నీరుగా విలపించే దుస్థితి దాపురించింది. అన్ని ప్రతికూలతలను తట్టుకుని, అప్పులు చేసి తెచ్చిన పెట్టుబడులతో పండించిన ఆ అరకొర పంటనైనా అమ్ముకుని గట్టెక్కుదామనుకున్న రైతన్నకు ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది.

ఖమ్మం జిల్లాలోని అనేక గ్రామాల్లో ఖరీఫ్ ధాన్యం రాశులు క‌ల్లాల్లో పేరుకుపోయినా, ఇప్పటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం పాలనా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోందనే విమర్శలున్నాయి.పంట కోతలు పూర్తయి ధాన్యం మార్కెట్‌కు పోటెత్తుతున్న తరుణంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ, ఏటా మాదిరిగానే ఈసారి కూడా అధికారుల అలసత్వం, ప్రభుత్వ జాప్యం రైతుల పాలిట మరణశాసనంగా మారాయి. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, గ్రామాల్లో ధాన్యాన్ని భద్రపరుచుకునేందుకు సరైన గిడ్డంగులు, నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితులను ప్రయివేట్ వ్యాపారులు, మిల్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుని దోపిడీకి తెరలేపారు. రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకుని దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభంలో కాస్త మెరుగైన ధర చెల్లించినట్టు నటించిన వ్యాపారులు, ప్రభుత్వ కేంద్రాలు లేవని నిర్ధారించుకోగానే అందరూ ఒక సిండికేట్‌గా ఏర్పడి ధరలను అమాంతం పడేశారు.


రెండు రోజుల వ్యవధిలోనే క్వింటా ధాన్యం ధర రూ.3,500 నుంచి ఏకంగా రూ.2,600కు పడిపోవడం, రోజుకు వంద రూపాయల చొప్పున కోత విధిస్తుండటం వ్యాపారుల దోపిడీ పర్వానికి పరాకాష్ట. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,481తో పాటు సన్న రకాలకు 500 రూపాయల బోనస్ అందిం చాలన్న నిబంధనలు కేవలం కాగితాలకే పరిమిత మయ్యాయి. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కూడా దక్కక, బోనస్ ఊసే లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ​పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులు తీర్చాలని ఒకవైపు రుణదాతల ఒత్తిడి, మరోవైపు ప్రకృతి వైపరీత్యాల భయం వెరసి అన్నదాతను నిస్సహాయుడిని చేశాయి. చేతికొచ్చిన పంటను కొనే దిక్కులేక, తప్పనిసరి పరిస్థితుల్లో దళారులు అడిగిన కాడికే ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన దయనీయ స్థితి నెలకొంది. రైతుల కష్టాన్ని దళారులు అగ్గువకు కొల్లగొట్టి, తమ గిడ్డంగులను నింపుకున్న తర్వాత ప్రభుత్వం తీరిగ్గా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే ఇక ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. పండించిన పంట రైతు చేతిలో ఉన్నప్పుడే కొనుగోలు చేయని వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందో పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని రైతులు, రైతు సంఘాలు నీలదీస్తున్నాయి.


కొనుగోలు కేంద్రాలు తెరిచి, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనాలి

​జిల్లాలో కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించినప్పుడు వడ్లు వస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేటు తగ్గిపోతుండటంతో భయాందోళనతో వ్యాపారులకు తెగనమ్ముకుంటున్నారు. తొలుత మద్దతు ధర కంటే ఎక్కువ రేటు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో పరిస్థితి మారిపోయింది. ధాన్యం తడిసిపోతుండటంతో ధరను మరింత తగ్గిస్తున్నాయి. రెండు తుఫానులు, గాలుల కారణంగా వరి పంట ఎక్కువగా తడిసిపోయింది. దీంతో ఎకరానికి 10వేల నుంచి 15 వేల రూపాయల వరకు ఖర్చు పెరుగుతోంది. కటింగ్ పేరిట క్వింటాల్‌కు 300 రూపాయలు పెంచారని, మరోవైపు రేటు కూడా తగ్గిపోవడంతో ఆరబెట్టకుండా ఉన్న వడ్ల ధర దారుణ స్థాయికి పడిపోయింది. దీనివల్ల రైతులకు క్వింటాల్‌కు సుమారు 600 రూపాయల వరకు నష్టం వాటిల్లుతోంది.
- నున్నా నాగేశ్వరరావు,
 సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్