ఎన్ని అడ్డంకులొచ్చినా సహజ వనరులను కాపాడుకుంటాం
మా పూర్వీకులే మాకు మోడల్
గుజరాత్ మోడల్ అవసరం లేదు
డ్రగ్స్ కట్టడిపై కేంద్రం ప్రశంస
ప్రకృతి పరిరక్షణ కూడా గ్లోబల్ సమ్మిట్ లో భాగమే : క్లైమెట్ కాంక్లేవ్ కర్టైన్ రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ను కేవలం పెట్టుబడులను ఆకర్షించేందుకు మాత్రమే కాకుండా ప్రకృతిని పరిరక్షించేందుకు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా విచ్చేసే మేధావులు సూచనలను, వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని విధానాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన ‘క్లైమెట్ కాంక్లేవ్ కర్టైన్ రైజర్’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. పెట్టుబడులు, ప్రకృతి తమకు రెండు కండ్లని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడం పట్ల తమకు ఎంత బాధ్యత ఉందో ప్రకృతిని కాపాడటం పట్ల కూడా అంతే బాధ్యత ఉందని తెలిపారు. భావితరాలకు సహజ వనరులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, వాటి అమలులో అనేక అడ్డంకులొచ్చినా వెనక్కి తగ్గడం లేదని చెప్పారు. ధనవంతుల నుంచి విమర్శలు వస్తున్నా వాటిని లెక్క చేయడం లేదని తెలిపారు. తమకు గుజరాత్ మోడల్ ను కాపీ చేయాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 800 ఏండ్ల క్రితం కాకతీయ సామ్రాజ్యంలో నాటి రాజులు, ప్రజలు ప్రకృతిని కాపాడుకునేందుకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు.
రేచర్ల రుద్రారెడ్డి, రాణి రుద్రమదేవి మొదలు జల్, జమీన్, జంగల్ కోసం అమరుడైన కొమరం భీంల వారసత్వం తమకుందని ఆయన గుర్తుచేశారు. ఆ చరిత్రను, వారసత్వాన్ని కాపీ చేస్తే సరిపోతుందని తెలిపారు. గొలుసుకట్టు చెరువుల నిర్మాణాలను ఆయన వివరించారు. హైదరాబాద్ లో 1,300 చెరువులుండేవనీ, ప్రస్తుతం700 మాత్రమే మిగిలాయనీ, వాటిని కాపాడేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని తెలిపారు. తమపై దూషణలు వస్తున్నా సరే.... ముందుకే వెళ్తున్నామని చెప్పారు. పేదలకు పునరావసం కల్పిస్తూ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు. అంబర్ పేట బతుకమ్మ కుంట, హైటెక్ సిటీ తుమ్మడికుంటలను కబ్జాల నుంచి విడిపించి పునరుద్ధరించినట్టు తెలిపారు. హైదరాబాద్ లో ఇండ్లలోకి నీళ్లు రావడం లేదనీ, నీళ్లలోనే ఇండ్లను నిర్మించడంతోనే సమస్య వస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. దీంతో వరదలు వచ్చిన సమయంలో వరద నీటికి ఎటుపోవాలో ప్రజలకు తెలియడం లేదన్నారు. కోవిడ్-19 తర్వాత వాతావరణంలో పెను మార్పులు వచ్చాయని అన్నారు. ఊహించని స్థాయిలో వర్షం కురిసిన సమయంలో హైదరాబాద్ అతలాకుతలం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్నినోతో తాగునీటి సమస్య
ఎల్ నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాలకు సరిపడా ఆహార ధాన్యాలున్నాయని స్పష్టం చేశారు. రాబోయే ఎనిమిది నెలలు వర్షాలు కురిసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కరోనాను ఎదుర్కొన్నట్టే ఈ విపత్తును రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాల్సిన అవసరముందని ఆయన ఆకాంక్షించారు. రైతులు ఒక పంటను త్యాగం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన లాంటి వారు చెబితే రాజకీయంగా మారుతున్నదనీ, అందుకే ప్రస్తుత పరిస్థితిలో రైతులు ఏం చేయాలో వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్, గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్ లాంటి వారు రైతులకు, ప్రజలకు పిలుపునివ్వాలని ఆయన కోరారు.
రాష్ట్రాన్ని క్యూర్, రేర్, ప్యూర్ లుగా విభజించి సర్వీస్, వ్యవసాయరంగాల ద్వారా ఆర్థిక ప్రగతిని సాధించేందుకు ప్రణాళికలు వేసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ నుంచి కాలుష్యకారక పరిశ్రమలను తరలించామన్నారు. బస్సులను, ఆటోలను ఎలక్ట్రానిక్ మోడ్ లోకి తెచ్చినట్టు చెప్పారు. సంప్రదాయేతర ఇంధన వనరుల పెంపుదల కోసం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఆహార, ఔషధాల కల్తీపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు.
మోడీ, అమిత్ షా ప్రశంసలు
డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచి తమ అధికారి ఇటీవల షీల్డ్ కూడా అందుకున్నారని చెప్పారు. కట్టడి చేసే క్రమంలో ఈ వ్యాపారంలో ఎంతటి వారున్నా వదలిపెట్టడం లేదనీ, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేను జైలుకు పంపించినట్టు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్, పద్మశ్రీ చింతల వెంకట్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)