ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రబీ పంటల సాగు కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించి, ప్రతి జిల్లాలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అనువైన పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి సీనియర్ అధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయం, ఉద్యానవన శాఖ, సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం, కూరగాయలు, పప్పుధాన్యాల సాగు, ధాన్యం కొనుగోళ్లు, భూసేకరణ సమస్యలు, పాఠశాల విద్యా కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించారు.ప్రభుత్వ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపై ఉందని తెలిపారు.ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేపట్టాలని సూచించారు.
విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలనీ, రైతులకు సకాలంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కూరగాయలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను గరిష్టంగా వినియోగించుకొని సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సూక్ష్మ సేద్యం, ముఖ్యంగా బిందు సేద్యం విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలలను తరుచూ సందర్శించి విద్యా కార్యక్రమాల అమలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, బోధనా ప్రమాణాలను పరిశీలించాలని ఆదేశించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వీబీగ్రామ్జీ విస్తరణకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఇలంబర్తీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)